Share News

Phone Tapping: నేడు మళ్లీ సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు?

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:52 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ చాలా వరకు పూర్తి కావడంతో ట్యాపింగ్‌ సూత్రధారి ప్రభాకర్‌రావును గురువారం మరోసారి విచారణ చేయడానికి సిట్‌ అధికారులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది.

Phone Tapping: నేడు మళ్లీ సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు?

  • ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌

  • ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి పిలుపు

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ చాలా వరకు పూర్తి కావడంతో ట్యాపింగ్‌ సూత్రధారి ప్రభాకర్‌రావును గురువారం మరోసారి విచారణ చేయడానికి సిట్‌ అధికారులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. గత విచారణలో ప్రభాకర్‌రావు నుంచి స్వాధీనం చేసుకున్న ఒక లాప్‌ట్యాప్‌, ఒక ఫోన్‌ను ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి సిట్‌ అధికారులు పంపారు. ప్రభాకర్‌రావు రెండు ఫోన్లను ఉపయోగిస్తుండగా ఒక ఫోన్‌ను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్‌ ప్రస్తుతం తన వద్ద లేదని, దానిని అమెరికాలో మర్చిపోయానని ప్రభాకర్‌రావు చెబుతున్నట్లు సమాచారం.


ఆఫీసుకు సంబంధించిన ఫోన్‌ అధికారులకు అందగా.. వ్యక్తిగత ఫోన్‌ ఇంకా అందలేదని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఫోన్లో డేటా డిలీట్‌ అయి ఉండటంతో ల్యాబ్‌లో నిపుణుల ద్వారా డేటా రిట్రీవ్‌ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సిట్‌ అధికారులు ఫోన్‌ చేసి మరోసారి విచారణకు రావాలని కోరారు. అయితే, తన కాలికి శస్త్ర చికిత్స జరిగినందున ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు సిట్‌ అధికారులకు ఆయన తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సిట్‌ బృందం, ఇటీవలే రఘునందన్‌ స్టేట్‌మెంట్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. యశోదా ఆస్పత్రికి వచ్చిన ప్రత్యేక బృందం, సుమారు రెండు గంటల పాటు రఘునందన్‌రావు ఇచ్చిన వివరాలను తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jul 10 , 2025 | 04:52 AM