Share News

Ponnam Prabhakar: ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి.. నిరసనలు తెలపడం హాస్యాస్పదం

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:46 AM

శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Ponnam Prabhakar: ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి.. నిరసనలు తెలపడం హాస్యాస్పదం

  • ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌ పట్ల అనుచిత ప్రవర్తన

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • బీఆర్‌ఎ్‌సకు దళితులంటే చిన్న చూపు: మల్లు రవి

  • కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తా అనడం విడ్డూరం: చామల

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. చట్ట సభకు అధిపతి అయిన స్పీకర్‌ను గౌరవించకుండా.. ‘సభ మీ ఒక్కడిది కాదు’ అని సభ్యుడు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. స్పీకర్‌ దళితుడని ఆ విధంగా మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు. సభ సంప్రదాయాలు, విలువల గురించి తెలిసిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం సైతం జగదీశ్‌రెడ్డి చేసింది తప్పు అని చెప్పలేదంటే.. వారంతా ఉద్దేశపూర్వకంగా చేశారని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇదే సభలో గతంలో శాసన మండలి చైర్మన్‌పై కాగితాలు విసిరేశారనే కారణంతో ఇద్దరు సభ్యులను బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది మరచిపోయారా..? అని బీఆర్‌ఎస్‌ నేతలను పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.


స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ దళితులను చిన్నచూపు చూస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితుడిని చేస్తాని చెప్పిన కేసీఆర్‌.. ఆ తర్వాత తానే సీఎం అయ్యాడన్నారు. ఆనాడు దళితుడైన రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్‌ చేసి అవమానించాడని, దళిత ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సభ్యత్వాన్నీ రద్దు చేశారని గుర్తు చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌కు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేసే దాకా ఆమరణ దీక్ష చేస్తానంటూ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘దళిత నాయకత్వం పట్ల కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉద్యమ కాలం నుంచీ ఇప్పటిదాకా దళితులను బీఆర్‌ఎస్‌ నాయకత్వం వంచిస్తూనే ఉంది. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌తో బీఆర్‌ఎస్‌ వారికి విస్కీలో సోడా మిస్‌ అయినంత పనైంది. ఇంకెవరిపైనైనా వేటు వేస్తే వారికి ఇంత బాధ ఉండకపోయేది. సాయంత్రం కార్యక్రమాలు ఎట్లా నడిపించాలో వారికి అర్థమవుతలేదు’ అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని మోదీ సర్కారు ఎందుకు గద్దె దిగడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు.

Updated Date - Mar 15 , 2025 | 04:46 AM