Share News

Ponnam Prabhakar: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:50 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాకుండా ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం అత్యంత బాధాకరం.

Ponnam Prabhakar: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి

  • ఇందిరాపార్క్‌ వద్ద వారి ఆందోళనలు అత్యంత బాధాకరం

  • 5, 6 తేదీల్లో ఢిల్లీ ధర్నాకు అన్ని పార్టీల వారు రావాలి: పొన్నం

గోల్నాక/పంజాగుట్ట, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాకుండా ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం అత్యంత బాధాకరం. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంలోని వారి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’ అని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీసీ ప్రధానియే ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడం మాని బీసీ రిజర్వేషన్లకు వారి అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌ ఛే నెంబర్‌లోని మహారాణాప్రతాప్‌ ఫంక్షన్‌హాల్‌లో అంబర్‌పేట నియోజకవర్గానికి సంబంధించిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని.. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 5, 6వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీల వారు రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు రాజకీయాలు మానుకోవాలని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.


బీసీ రిజర్వేషన్ల అమలుకు పోరాటమే మార్గం..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సంఘటిత పోరాటమే ఏకైకమార్గమని పలు పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎస్‌ సమావేశం నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పలు బీసీ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:50 AM