Share News

Ponguleti: రైతుబంధు దోపిడీకే ధరణి తెచ్చారు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:12 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో లక్షల ఎకరాలు కబ్జా అయ్యాయని.. ఆ పోర్టల్‌ పేదలకు ఎన్నో కష్టాలు తెచ్చిందని, రైతుబంధు నిధులను దోచుకునేందుకే ధరణిని తెచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి ఆరోపించారు.

Ponguleti: రైతుబంధు దోపిడీకే ధరణి తెచ్చారు

  • పేదలను ఆ పోర్టల్‌ ఎన్నో కష్టాల్లోకి నెట్టింది

  • భూ భారతితో ధరణి మోసాలకు చెక్‌

  • నాలుగేళ్లలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

అశ్వారావుపేట, ఎల్కతుర్తి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో లక్షల ఎకరాలు కబ్జా అయ్యాయని.. ఆ పోర్టల్‌ పేదలకు ఎన్నో కష్టాలు తెచ్చిందని, రైతుబంధు నిధులను దోచుకునేందుకే ధరణిని తెచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో భూములు లేకున్నా ఒక్కొక్కరు 20-30 ఎకరాలకు పట్టా పుస్తకాలు సృష్టించుకొని రైతుబంధును కాజేసేందుకు ధరణి ఉపయోగించుకున్నారని విమర్శించారు. ధరణితో తలెత్తిన సమస్యలకు చెక్‌పెట్టి రైతుల భూ రికార్డులకు, భూములకు రక్షణ కల్పిచేందుకు ‘భూ భారతి’ చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సన్న బియ్యం పథకానికి వచ్చిన మంచి పేరు భూభారతి చట్టానికి కూడా వస్తుందని చెప్పారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక గత సర్కారులో పెండింగ్‌లోఉన్న 5,45,000 భూ సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు.


ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులకు హక్కులు లేకుండా పోయాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక కమిటీని వేసి పరిష్కార మార్గాలు కనుగొంటామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 మంజూరు చేస్తామని, నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని వివరించారు.. 9,50000 సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తులకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి ప్రకటించారు. వచ్చే నెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 28మండలాలను పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని భూ భారతి గ్రామసభలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.. వీటిలో అనుభవాలను క్రోడీకరించుకొని జూన్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమలులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రస్తుతం కొన్ని మాత్రమే అమలవుతున్నాయని, మిగతావి దశలవారీగా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధికోసం రాజీవ్‌ యువ వికాస్‌ పథకం ద్వారా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమైన తెలంగాణాను రూ.8,19,000కోట్ల అప్పుల్లోకి నెట్టిందన్నారు. ఆ అప్పులు తీర్చుకుంటూనే కొత్త పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఫలితంగానే పథకాల అమలు ఆలస్యమవుతోందన్నారు. కాగా అంతకుముందు అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రి ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 04:12 AM