Share News

గత ఆగస్టులో న్యాయవాది మృతి

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:08 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే.

గత ఆగస్టులో న్యాయవాది మృతి

  • కేసు వేసిన రాజలింగమూర్తి ఇటీవల దారుణ హత్య

  • కాళేశ్వరానికి లింకు పెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి.. చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే. కాగా, ఈ కేసును వాదించిన న్యాయవాది గత ఏడాది ఆగస్టులోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు కారణమూంటూ రాజలింగమూర్తి భూపాలపల్లి పోలీ్‌సస్టేషన్‌లో కేసు పెట్టారు. అయితే కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు విముఖత చూపడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2024 సెప్టెంబరు 5న విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్‌, హరీ్‌షరావుతోపాటు మరో ఆరుగురికి కోర్టు నోటీసులు జారీ చేసింది.


అయితే కేసీఆర్‌, హరీశ్‌రావు డిసెంబరు 23న హైకోర్టులో క్యాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో 2025 జనవరి 7లోగా తగిన కారణాలు చూపించాలంటూ రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు ఫిబ్రవరి 20వరకు గడువు కావాలని రాజలింగమూర్తి కోరగా.. హైకోర్టు అంగీకరించింది. కానీ, కేసు విచారణకు ఒక్క రోజు ముందే ఫిబ్రవరి 19న రాజలింగమూర్తి దారుణహత్యకు గురయ్యారు. భూ తగాదాలే రాజలింగమూర్తి హత్యకు కారణంగా చెబుతున్నప్పటికీ.. కాళేశ్వరంలో అవినీతే రాజలింగమూర్తి ప్రాణం తీసిందని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. మరోవెపు ఇదే కేసును రాజలింగమూర్తి తరుఫున వాదిస్తున్న న్యాయవాది గంటా సంజీవరెడ్డి గత ఆగస్టులో గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హనుమకొండలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ వారం తరువాత మృతి చెందారు. దీంతో ఆయనపై ఎవరైనా ఒత్తిడి చేయడం వల్లే గుండెపోటుకు గురయ్యారా? అనే అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.

Updated Date - Feb 27 , 2025 | 04:08 AM