Police Investigation: అనిల్ హత్య కేసులో ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:51 AM
దక్ జిల్లా పైతర గ్రామానికి చెందిన యువ నాయకుడు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.

పరారీలో ఇద్దరు.. పాతకక్షలు, ఆర్థిక వివాదాలతోనే హత్య
బిహార్ నుంచి తుపాకీ, తూటాలు కొన్న నిందితులు: మెదక్ ఎస్పీ
మెదక్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా పైతర గ్రామానికి చెందిన యువ నాయకుడు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. హత్య ఘటనలో ఏడుగురికి ప్రమే యం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. గ్రామానికే చెందిన సోమన్నగారి రవీందర్‌రెడ్డి, అనిల్‌కు మధ్య విబేధాలే హత్యకు దారితీశాయని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. మారెల్లి అనిల్ ఈ నెల 14న హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా, రాత్రి కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఆయన్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సోమవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనిల్, గ్రామానికి చెందిన సోమన్నగారి రవీందర్‌రెడ్డి సతీమణి లక్ష్మికి రాజకీయ సహచరుడిగా చాలా ఏళ్లు పని చేశారు. కరోనా సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత రవీందర్‌రెడ్డి వద్ద అనిల్ పని చేశారు. అనిల్ కుటుంబం రవీందర్ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. మూడేళ్ల క్రితం అనిల్ అక్కడ సాగును నిలిపివేశారు.
ఆ భూమిలో ఇతరులు సాగు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. పైగా తనకు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనిల్ ఊర్లో ప్రచారం చేస్తున్నారని ఆయనపై రవీందర్ రెడ్డి కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన నాగరాజుతో చర్చించాడు. నాగరాజు, అనిల్ ఒకప్పుడు స్నేహితులే. 2014లో నాగరాజు వార్డు సభ్యుడిగా ఉన్నప్పుడు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో నాగరాజు పోటీ చేయడానికి ఆసక్తి చూపగా.. అనిల్, ఆయన అనుచరులు అవమానించారు. నాగరాజు తల్లికి మంజూరైన డబుల్ బెడ్‌రూం ఇంటిని కూడా అనిల్ రద్దు చేయించారని నాగరాజు కోపం పెంచుకున్నాడు. ఇక గ్రామానికి చెందిన నాగభూషణం నుంచి అనిల్ రూ.6 లక్షలు అప్పుగా తీసుకుని, తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో రవీందర్, నాగరాజు, నాగభూషణం కలిసి అనిల్‌ను అంతం చేయాలని పథకం వేశారు. నాగరాజుకు మేడ్చల్‌లో వర్క్‌షాప్ ఉంది. అందులో మెకానిక్‌లుగా ఫరీద్, షాబొద్దీన్, చిన్నా పనిచేస్తున్నారు. ఫరీద్‌కు బిహార్‌కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. గత నెల 26న ఫరీద్, సచిన్‌ను కలిసేందుకు విమానంలో పట్నా వెళ్లాడు. అక్కడ సచిన్ వద్ద నుంచి తుపాకీ, ఆరు రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు.
ఈ నెల 14న అనిల్.. హైదరాబాద్‌కు వెళుతున్నారని తెలియడంతో అంతకుముందు రోజే నాగరాజు, షర్పోద్దీన్, చిన్నా కలిసి కౌడిపల్లికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు హైదరాబాద్ వెళ్లిన అనిల్‌ను నాగరాజు అనుసరించాడు. మరో నిందితుడు అశోక్‌కు ఫోన్ చేసి గుమ్మడిదలకు కారు తీసుకురమ్మని చెప్పాడు. రాత్రి 7గంటల సమయంలో అనిల్ గుమ్మడిదల చెక్‌పోస్ట్ దాటి వెళ్తుండగా గమనించి అనుసరించారు. తన కారులో ఉన్న మిత్రులు శేఖర్, బాలేశ్‌ను కౌడిపల్లిలో దిగబెట్టి ఒంటరిగా వెళుతున్న అనిల్‌పై అప్పాజిపల్లి వద్ద దాడికి యత్నించే క్రమంలో పెట్రోలింగ్ వాహనం చూసి వెనక్కి తగ్గారు. వరిగుతం శివారు సబ్‌స్టేషన్ వద్ద అనిల్‌ను కారుతో అడ్డగించారు. షర్పోద్దీన్ కారులోంచి దిగి తన దగ్గర ఉన్న పిస్టల్‌తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. బులెట్ల గాయాలు కావడంతో కారు అదుపుతప్పి సబ్‌స్టేషన్ గేటును ఢీకొట్టింది. అనిల్ కారులోనే మృతిచెందాడు. అనంతరం నిందితులు పారిపోయారు. ఈ కేసులో రవీందర్, నాగభూషణం, నాగరాజు, ఫరీద్, అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షర్పోద్దీన్, చిన్నా కోసం వెతుకుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News