Adilabad: పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:49 AM
అదొక పాఠశాల! సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు! ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ, స్కూలు వాటర్ టాంక్‌లోనూ పురుగులమందు కలిపాడొక దుండగుడు.

మధ్యాహ్నం భోజనం వండే పాత్రల్లోనూ..
అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది
సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు
నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు
ఇచ్చోడ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అదొక పాఠశాల! సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు! ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ, స్కూలు వాటర్ టాంక్‌లోనూ పురుగులమందు కలిపాడొక దుండగుడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది సకాలంలో గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ధరంపురి ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 30మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రోజూలాగే బుధవారం కూడా విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ స్కూల్‌కు వచ్చారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండే సమయంలో వంట గదికి తాళం పగలగొట్టి ఉండడంతో.. విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పారు. అప్రమత్తమైన హెచ్‌ఎం.. సమాచారాన్ని గ్రామ పెద్దలకు వెంటనే స్కూల్‌కు వెళ్లి చూడగా గదిలో పురుగుల మందు వాసన రావడంతో పాటు వంట పాత్రల్లో తెల్లటి వర్ణంలో ద్రావణం కనిపించింది.
దీంతో పాఠశాలలోని వంట సామగ్రిలో పురుగుల మందు కలిసిందని గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగు నీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు గుర్తించారు. వెంటనే వారు విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చివరకు గ్రామానికి చెందిన సోయం కిష్టు అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్టు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఇంట్లో వారిపై కోపంతో పాటు అతని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని గుర్తించారు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పిల్లలంతా విష ప్రయోగం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.