Panchayat Election: రూ.27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలం!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:02 AM
పంచాయతీ ఎన్నికల అంటే పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్ వాతావరణమే ఉంటుంది.

ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట
12 మంది పాల్గొన్నట్టు సమాచారం
జోగుళాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో ఘటన
మానవపాడు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల అంటే పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్ వాతావరణమే ఉంటుంది. మాకెందుకు ఇదంతా..!! అని అనుకున్నారో ఏమో కానీ ..!! రాష్ట్రంలోని ఓ గ్రామ సర్పంచ్ పదవిని ఆ ఊరి పెద్దలంతా కలిసి వేలం వేసి విక్రయించేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.27.60 లక్షలకు ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని ఆ వేలంలో కొనేశాడని తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడకముందే ఈ వ్యవహారం జరగడం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
గోకులపాడులో 546 మంది ఓటర్లు ఉండగా.. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దల సమక్షం లో ఆదివారం నిర్వహించిన వేలంపాటలో దాదాపు 12 మంది పాల్గొన్నారట. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.27.60 లక్షలు పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడట. అయితే, సర్పంచ్ పదవి కోసం కాదు.. గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం కోసం వేలం పాట నిర్వహించామని కొందరు అంటుంటే.. అసలు వేలంపాటే జరగలేదని గ్రామానికి చెందిన మరికొందరు అంటుండడం గమనార్హం.