Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటిన భారత్
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:53 AM
ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి మరోమారు తెలిశాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

దేశీయంగానే డ్రోన్లు, క్షిపణుల అభివృద్ధి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వామ్యమైన రక్షణ రంగ శాస్త్రవేత్తలకు సత్కారం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి మరోమారు తెలిశాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్వదేశీ క్షిపణులు, డ్రోన్లు, శక్తిమంతమైన ఎలకా్ట్రనిక్ వార్ఫేర్, శత్రుదుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ వినియోగంతో భారత్ తన శక్తి, స్థాయిని చాటిందన్నారు. భారత్ ఆర్థికంగా కుదేలైన దేశమని ప్రచారం చేస్తున్న వారికీ భారత్ సత్తా అతి త్వరలోనే అర్థమవుతుందని అమెరికా అధ్యక్షుడిపై ధ్వజమెత్తారు. హైదరా బాద్‌లో ఆదివారం జరిగిన ‘ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వామ్యం వహించిన సైనికులకు, శాస్త్రవేత్తలకు వందనం’ అనే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత శైక్షిక్ మహాసం్‌ఘ(ఏబీఆర్‌ఎ్‌సఎమ్), వాయిస్ ఆఫ్ హైదరాబాదీ అకడమిషియన్స్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర పోషించిన రక్షణశాస్త్రవేత్తలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధక్షేత్రంలో హీరోలు సైనికులైతే, శక్తిమంతమైన యుద్ధ వ్యవస్థలను అభివృద్ధి చేసి సైనికులకందించిన శాస్త్రవేత్తల పాత్ర కీలకమని ప్రశంసించారు. స్వాతంత్య్ర భారత్.. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని, ఈ విషయంలో ఇతరుల జోక్యానికి చోటు లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇతివృత్తంగా మల్లేపల్లి మోహన్ స్వరపరిచిన శౌర్యగీతాన్ని ఆవిష్కరించిన వెంకయ్య.. గీత రచయిత అగరం వసంత్, ఆంగ్ల అనువాదకుడు వంగీపురం శ్రీనివాసాచార్యను అభినందించారు.
శాస్త్రవేత్తలకు సన్మానం
డీఆర్‌డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఉమ్మాలనేని రాజాబాబు, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు డాక్టర్ జి. సతీ్‌షరెడ్డి, తెలంగాణ, ఏపీ సబ్‌ఏరియా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ డైరెక్టర్ జగన్నాథ నాయక్, ఆకాశ్ మిస్సైల్ ప్రోగ్రాం మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి, ఆకాశ్ ప్రాజెక్టు డైరెక్టర్ అజిత్ బి చౌదరి, అస్త్ర మిస్సైల్ సిస్టమ్ మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ పాట్రిక్ డిసిల్వా, అస్త్ర ప్రైమ్ ప్రాజెక్టు డైరెక్టర్ నరేంద్ర కాలె, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ పావులూరి సుబ్బారావును సన్మానించారు. కాగా, స్వదేశీ ఆయుధాలను విస్తృతంగా వాడిన తొలి యుద్ధంగా ఆపరేషన్ సిందూర్ నిలుస్తుందని డీఆర్‌డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఉమ్మాలనేని రాజాబాబు అన్నారు. సతీష్ రెడ్డి మార్గదర్శకత్వంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డైరెక్టర్ జగన్నాథ నాయక్ తెలిపారు. ఇక, ఎంతోమంది సమ్మిళిత కృషితో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిలో మొదటి స్వదేశీ సెన్సార్‌ను జగన్నాథ్ నాయక్ అమర్చారని, ఆ సెన్సార్ వల్లే నేడు ఆకాశ్ శక్తిమంతంగా పని చేస్తోందని ఆకాశ్ ప్రాజెక్టు డైరెక్టర్ అజిత్ బి చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News