Maoists: కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ కాల్చివేత
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:33 AM
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి.

వరంగల్/చర్ల/వాజేడు/వెంకటాపురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్ మృతిచెందారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. వీరంతా హిడ్మా దళానికి(పీఎల్‌జీ ఒకటో బెటాలియన్) చెందిన వారని అనుమానిస్తున్నారు. మరోవైపు కర్రెగుట్టల చుట్టూ-- ఉత్తరాన ఛత్తీ్‌సగఢ్‌లోని పూజారి కాంకేర్, తూర్పున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, తూర్పున ఇంద్రావతి నది ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. కర్రెగుట్టల పరిసరాల గూడేల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొన్ని గూడేల ప్రజలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు. రెండ్రోజులుగా అడవుల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నాయని కర్రెగుట్టల పర్యటనకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరించారు. పెద్ద ఉట్లపల్లిలో ఓ భాగం పూర్తిగా ఖాళీగా కనిపించింది. ఇళ్లలో జనాలెవ్వరూ లేరు.
కర్రెగుట్టలపైకి పంపుతున్న డ్రోన్లు.. థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతతో మావోయిస్టుల ఉనికిని గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమాచారం మేరకు బలగాలు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరుపుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో హిడ్మాతోపాటు.. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు దామోదర్ తదితరులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం. తెలంగాణ వైపు కూడా కర్రెగుట్టల్లో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బలగాలు గుర్తిస్తూ.. నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. గురువారం కూడా బలగాలు మందుపాతరలను నిర్వీర్యం చేసినప్పుడు వచ్చే భారీ శబ్దాలతో ఈ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. వాజేడు, వెంకటాపురం మండలాల మీదుగా నిరంతరం హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రెండ్రోజులుగా ఎండలు తీవ్రమవ్వడంతో.. కూంబింగ్‌లో ఉన్న 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆదివాసీ జన హననాన్ని అడ్డుకోండి
రాష్ట్రపతికి పీస్ డైలాగ్ కమిటీ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ‘మావోయిస్టుల అణచివేత పేరిట అమాయక ఆదివాసీలను హతమారుస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఆదివాసీల జనహననాన్ని అడ్డుకోవడం ఆదివాసీ బిడ్డగా మీ బాధ్యత’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పీస్ డైలాగ్ కమిటీ, పలు సంఘాల నాయకులు లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి.. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయాలని రాష్ట్రపతిని పీస్ డైలాగ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, దంతేవాడ ఆదివాసీ యాక్టివిస్ట్ సోనిసోరి, ఛత్తీ్‌సగఢ్ బచావో ఆందోళన్ ప్రతినిధి బేలా భాటియా, పీయూసీఎల్ ప్రతినిధి కవితా శ్రీవాత్సవ, సీడీఆర్‌వో ప్రతినిధి క్రాంతి చైతన్య, ఆపరేషన్ గ్రీన్ హంట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి పర్మిందర్ సింగ్ లేఖలో కోరారు. ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని బస్తర్, గడ్చిరౌలి, పశ్చిమ సింగభం ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత పేరిట మారణకాండ సృష్టిస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News