Share News

Sand Market: ఈ రేతిగ అగ్గువా!

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:40 AM

రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక బజార్లలో ఇసుక అగ్గువకే దొరుకుతోంది. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే టన్నుకు రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువకే లభిస్తోంది.

Sand Market: ఈ రేతిగ అగ్గువా!

ఇసుక బజార్లలో ఇసుక చౌక

  • దొడ్డు ఇసుక రూ.1600, సన్నది 1800

  • బహిరంగ మార్కెట్‌తో పోల్చితే తక్కువే

  • టన్నుకు రూ.300 నుంచి 500 తగ్గింపు

  • పదిరోజులుగా పెరిగిన కొనుగోళ్లు

  • బజార్లలో కొని బయట విక్రయాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక బజార్లలో ఇసుక అగ్గువకే దొరుకుతోంది. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే టన్నుకు రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువకే లభిస్తోంది. ఫలితంగా అవసరమైన వాళ్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తుండటంతో ఆన్‌లైన్‌లో ఉంచగానే సరుకును హాట్‌కేకుల్లా బుక్‌ అవుతోంది. గత నెలలతో పోల్చితే పది రోజులుగా పెద్దఎత్తున ఇసుక బజార్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లను తెచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో ఇసుక బజార్లను ఏర్పాటు చేశారు. దొడ్డు ఇసుకకు టన్ను ధర రూ.1600, సన్న ఇసుకకు టన్ను ధర రూ.1800 నిర్ణయించారు. ఇసుక బజార్ల నుంచి నేరుగా ఇసుక కొనుగోలుకు అవకాశం లేదు. టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇసుక కొనుగోలు ధరకు జీఎస్టీ, రవాణా చార్జీలు అదనం. ఉదాహరణకు పది టన్నుల సన్న ఇసుకను బుకింగ్‌ చేసుకుంటే టన్నుకు రూ.1800ల చొప్పున 10 టన్నులకు రూ.18వేలతో పాటు జీఎస్టీ 2.5శాతం, సర్వీసు చార్జీలతో కలిపి రూ.18,960 బిల్లు వస్తుంది. బుకింగ్‌ సమయంలోనే ట్రక్కు వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. బుకింగ్‌ పూర్తయ్యాక కొనుగోలుదారులే బుకింగ్‌లో పొందుపరిచిన వాహనాన్ని పంపిస్తే ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. ఇసుకతో వచ్చిన లారీని ఖాళీ చేసుకునే (అన్‌లోడింగ్‌) బాధ్యత కొనుగోలుదారులదే. జీఎస్టీ చార్జీలు, రవాణా చార్జీలు, ఖాళీ చేసే కార్మికుల కూలీతో కలిపి టన్ను ఇసుకను అదనంగా రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతోంది.


బయట రూ.2,300 వరకు ధర

నగరంలో ఆటోనగర్‌, ఉప్పల్‌, సంతో్‌షనగర్‌, చింతల్‌, తిరుమలగిరి, కాప్రా ఇలా దాదాపు 30 ప్రాంతాల్లో ఇసుక అడ్డాలున్నాయి. అక్కడ ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వందల లారీలతో ఇసుకను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో బహిరంగ మార్కెట్‌లో దొడ్డు ఇసుక టన్ను ధర రూ.1900 నుంచి రూ.2వేల వరకు ఉండగా.. సన్న ఇసుక టన్ను ధర రూ.2వేల నుంచి 2300 వరకు ఉంది. ఇందులోనే రవాణా, అన్‌లోడింగ్‌ చార్జీలన్నీ ఉంటాయి. కొంత మంది లారీ యజమానులు ఇసుక బజార్‌లో బుకింగ్‌ చేసుకొని కూడా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.


హాట్‌ కేకుల్లా ఆన్‌లైన్‌లో బుకింగ్‌

నగర శివారులో అందుబాటులో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో గల ఇసుక బజార్లలో సన్న ఇసుక, దొడ్డు ఇసుకను ఆన్‌లైన్‌లో ప్రతిరోజు పది గంటలకు అమ్మకానికి పెడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఇసుక బజార్‌లో సన్న, దొడ్డు ఇసుకను వెయ్యి టన్నుల చొప్పున విక్రయానికి ఉంచుతున్నారు. నాలుగు ఇసుక బజార్ల నుంచి రోజుకు 8వేల మెట్రిక్‌ టన్నులు విక్రయానికి ఉంచుతున్నారు. జూన్‌ నెల మొత్తంలో నాలుగు ఇసుక బజార్లలో కలిపి 192 బుకింగ్‌లకు 1642 మెట్రిక్‌ టన్నుల ఇసుకను విక్రయించారు. జూలైలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 739 బుకింగ్‌ల ద్వారా 13,591 మెట్రిక్‌ టన్నులు విక్రయించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవహం పెరుగుతుండటంతో అక్కడ ఇసుక రీచ్‌లు మూతపడుతున్నాయి. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల్లో దొడ్డు ఇసుక దొరకడం లేదు. సన్న ఇసుక కూడా కొంత మేరే దొరుకుతోంది. దాంతో సన్న, దొడ్డు ఇసుకలకు డిమాండ్‌ పెరిగింది. గతంలో రోజుకు వందలాది లారీలు నగరానికి ఇసుక లోడ్‌తో వచ్చేవి. ప్రస్తుతం వర్షాలు, రీచ్‌ల్లో లోడింగ్‌ సమస్యలతో మునుపటి స్థాయిలో ఇసుక రావడం లేదు. దీంతో నగరంలో నిర్మాణ రంగానికి అవసరమైన మేరకు రీచ్‌ల నుంచి సరుకు రాకపోవడంతో.. ఇసుక బజార్లకు డిమాండ్‌ పెరిగింది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:40 AM