Riyaz Encounter Fake News: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్ జరగలేదు: సీపీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:57 PM
ఎన్‌కౌంటర్ ఘటనపై నిజామాబాద్ సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగా నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిపారు.
నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు రియాజ్ అరబ్ ను ఎన్‌కౌంటర్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఎన్‌కౌంటర్ ఘటనపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగా నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తుండగా పట్టుపడ్డాడని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఓ వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయని సీపీ పేర్కొన్నారు. రియాజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని ప్రాణాలతోనే ఉన్నారని తేల్చి చెప్పారు.
రియాజ్ ఎక్కడ దొరికాడంటే..
నిజామాబాద్‌లోని (Nizamabad)సారంగపూర్ సమీపంలో ఎప్పుడో రోడ్డు ప్రమాదానికి గురై నిరుపయోగంలో ఉన్న ఒక లారీలో నిందితుడు రియాజ్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి నుంచి 9 బృందాలతో పోలీసులు రియాజ్ కోసం గాలించారు. ఎట్టకేలకు రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు తప్పించుకునే క్రమంలో రియాజ్, మరో యువకుడికి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రియాజ్ కు గాయాలైనట్లు సమాచారం.
కానిస్టేబుల్ హత్య కేసు..
నిజామాబాద్(Nizamabad)లో కానిస్టేబుల్గా పని చేసే ప్రమోద్ తన అన్న కూతురు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంది. ఆమెను పరామర్శించడానికి శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఆకాశ్తో కలిసి ప్రమోద్ బైక్ పై బయలుదేరాడు. అదే సమయంలో రౌడీ రియాజ్ అరబ్ కు సంబంధించిన సమాచారం రావడంతో, మేనల్లుడితో కలిసి ఖిల్లా ప్రాంతానికి వెళ్లాడు. ఇదే విషయాన్ని సీసీఎస్ ఎస్సైలు విఠల్, భీం రావ్‌కు తెలియజేసి, నిందితుడి కోసం వెతుకుతుండగా మురికి కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
చివరకు నిందితుడు రియాజ్(Accused Riyaz)ని పట్టుకుని స్కూటీపైనే మధ్యలో కూర్చొబెట్టుకొని సీసీఎస్ స్టేషన్ కు తీసుకెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో నిందితుడు కత్తితో ప్రమోద్ ఛాతీలో పొడవగా, మేనల్లుడు ఆకాశ్ ఆపేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడి చేశాడు. వారి వెనకాలే బైక్ పై వచ్చిన ఎస్సై విఠల్ను అదే కత్తితో గాయపర్చి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య నిందితుడు రియాజ్ అరబ్‌ను పట్టుకునేందుకు ఎనిమిది స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి