Share News

CPI Leader: చందు నాయక్‌పై 2 తుపాకులతో కాల్పులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:07 AM

సీపీఐ నేత చందు నాయక్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన్ను హత్య చేసేందుకు దుండగులు అద్దెకారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

CPI Leader: చందు నాయక్‌పై 2 తుపాకులతో కాల్పులు

  • హత్య ఘటనలో 8 నుంచి 10 మంది ప్రమేయం

  • అద్దెకారులో వచ్చి ఫైరింగ్‌.. శరీరంలో 5 బులెట్లు

చాదర్‌ఘాట్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): సీపీఐ నేత చందు నాయక్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన్ను హత్య చేసేందుకు దుండగులు అద్దెకారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఒకరోజు ముందే చైతన్యపురిలో ఓ సంస్థ నుంచి కారును అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. చందు నాయక్‌ను హత్యచేశాక.. నలుగురు నిందితులు కారులో చైతన్యపురివైపు పారిపోయారు. నలుగురిలో ముగ్గురు మధ్యలోనే దిగిపోగా.. ఒకరు కారును అద్దెకు తీసుకున్న సంస్థలో అప్పగించాడు. అనంతరం.. కారును అప్పగించిన నిందితుడు అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో బైక్‌ను బుక్‌ చేసుకొని ఉప్పల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కారును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


చందు నాయక్‌ హత్య ఘటనలో నలుగురి ప్రమేయం ఉందని తొలుత భావించినా 8 నుంచి 10 మంది వరకు ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సంపాదించినట్లు సమాచారం. అలాగే.. చందు నాయక్‌పై ఐదురౌండ్ల కాల్పులు జరిపారని భావించినా, హత్య కోసం రెండు తుపాకీలు ఉపయోగించారని, 8రౌండ్లు కాల్చారని నిర్ధారణకొచ్చారు. చందు నాయక్‌ శరీరంలో ఐదు బులెట్లు దిగాయి. ఘటనాస్థలి నుంచి మూడు బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్‌ను హత్య చేసిన వ్యక్తులు ఎవరనే విషయంలోనూ పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. చందు నాయక్‌తో సన్నిహితంగా ఉండే రాజేశ్‌, శివ, ఏడుకొండలు, ప్రశాంత్‌, పాషా, యాదగిరితో పాటు మరికొందరికి హత్య ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సంపాదించారు. సాయినగర్‌లో గుడిసెల ఏర్పాటులో భాగంగా ఆర్థిక లావాదేవీలపై తలెత్తిన వివాదంతో పాటు వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణంగా భావిస్తున్నారు. ఎనిమిది మందిలో ఇప్పటికే నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 17 , 2025 | 04:07 AM