HYDRAA New Logo: హైడ్రాకు కొత్త లోగో
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:55 AM
హైదరాబాద్ హైడ్రా సంస్థకు కొత్త లోగోను ఆవిష్కరించారు. హెచ్ ఆకారంలో నీటి చుక్కతో నగర విశిష్టతను ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు.

హెచ్ ఆకారం.. పైన నీటి చుక్కతో డిజైన్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి కొత్త లోగో వచ్చింది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, వాటి పునరుద్ధరణ, విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ.. దాన్ని ప్రతిబింబించేలా నూతన లోగోను రూపొందించింది. హైదరాబాద్ నగరాన్ని సూచిస్తూ హెచ్ ఆకారం, అందులో ఆంగ్ల అక్షరాల్లో హైడ్రా.. పైన నీటి చుక్కతో లోగో డిజైన్ చేశారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ (ఈవీడీఎం)గా ఉన్న విభాగాన్ని ప్రత్యేక సంస్థ హైడ్రాగా ఏర్పాటు చేస్తూ 2024 జూలై 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌లను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈవీడీఎం.. దాని విధులను ప్రతిబింబించేలా పాత లోగో ఉండడంతో.. నూతనంగా ఏర్పడిన హైడ్రా విధులు, లక్ష్యాలకు అనుగుణంగా కొత్త లోగోను రూపొందించినట్టు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆమోదంతోనే నూతన లోగోను ఎంపిక చేసినట్టు తెలిసింది.