Share News

New Liquor Brands: కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయ్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:27 AM

కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్‌ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌

New Liquor Brands: కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయ్‌

  • రాష్ట్రంలో బీర్‌, లిక్కర్‌ అమ్మేందుకు 40 కంపెనీల అర్జీ

  • దరఖాస్తు చేసుకున్న వాటిలో సగం విదేశీ బ్రాండ్లు

  • విచారణ తర్వాత అనుమతి ఏప్రిల్‌ నుంచి విక్రయం

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్‌ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీజీబీసీఎల్‌) ఇచ్చిన నోటిఫికేషన్‌కు దాదాపు 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 20దాకా విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు కాగా.. మిగిలిన 20 స్వదేశీ బ్రాండ్లలో పది లిక్కర్‌, మరో 10 బీర్ల కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలో మద్యం, బీర్ల అమ్మకాలకు సంబంధించి టీజీబీసీఎల్‌ గత నెల 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్ణయించింది. దీంతో అందరి చూపు కొత్త బ్రాండ్లపై పడింది. అయితే, మొదట్లో దరఖాస్తులు రాకపోవడంతో ఆబ్కారీ శాఖ అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరి నాలుగైదు రోజుల్లోనే దరఖాస్తులు వచ్చాయి. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా అర్జీలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


సర్కారు పిలవడం ఇదే తొలిసారి..

ప్రస్తుతం రాష్ట్రంలో బీరు, మద్యం సరఫరా చేసే దేశీయ, విదేశీయ బ్రాండ్లు 53 వరకు ఉన్నాయి. ఇందులో 15 కంపెనీలకు తెలంగాణలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఆరు బీర్ల కంపెనీలున్నాయి. గతంలో మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇచ్చేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వమే నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కంపెనీలే కాకుండా ఇప్పటికే మద్యాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలు కూడా కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీజీబీసీఎల్‌ పేర్కొంది. మన దేశానికి చెందిన లిక్కర్‌, బీర్లను తయారుచేసే దాదాపు 95 శాతం బ్రాండ్లు టీజీబీసీఎల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవే. ఇక విదేశీ మద్యం పంపిణీదారులు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎ్‌ఫటీ) నుంచి అనుమతి తీసుకుని రాష్ట్రంలో సరఫరా చేస్తారు. అయితే, గతంలో సోమ్‌ బీర్లను అమ్మేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధం కాగా, ఆ కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ కంపెనీ మళ్లీ బీరు, మద్యం సరఫరాకు దరఖాస్తు చేసుకుంది. ఇక, రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఆరు బీర్ల బ్రాండ్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగే కింగ్‌ఫిషర్‌ పంపిణీదారులు.. రేట్లు పెంచాలని, బకాయిలు చెల్లించాలని ఇటీవల సరఫరాను నిలిపివేశారు. ధర పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పంపిణీని పునరుద్ధరించారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, కొత్త కంపెనీలు విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వమే దరఖాస్తులను ఆహ్వానించే పద్ధతిని తీసుకొచ్చింది.


నెలాఖరులోగా విచారణ పూర్తి..

దరఖాస్తు చేసుకున్న 40 బ్రాండ్లల్లో సగం విదేశీ సరఫరాదారులే ఉన్నారు. తాము పలు రాష్ట్రాల్లో నాణ్యతా ప్రమాణాలతో సరుకును పంపిణీ చేస్తున్నామని, తమపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంటూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెచ్చిన సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో జత చేశారు. మద్యం పాలసీని అమలు చేయడానికి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో పాటు చార్టెడ్‌ అకౌంటెంట్‌తో కూడిన కమిటీ బాధ్యత తీసుకుంటుంది. దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లను ఏయే ప్రాంతాల్లో విక్రయిస్తున్నారో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఆయా కంపెనీల నాణ్యత, ధర వంటి విషయాలపై ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తుంది. కంపెనీలు పేర్కొన్న ధర విషయంలోనూ బేరమాడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు జరిపేలా కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:27 AM