Share News

High Court Judges: కష్టాల నుంచి వచ్చిన వాళ్లం.. బాధలను అర్థం చేసుకుంటాం

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:23 AM

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ -ఏఐ) ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అది భావోద్వేగాలను అర్థంచేసుకోలేదని, కానీ తాము కష్టాలను, బాధలను అర్థంచేసుకుంటామని హైకోర్టు నూతన జడ్జీలు చెప్పారు.

High Court Judges: కష్టాల నుంచి వచ్చిన వాళ్లం.. బాధలను అర్థం చేసుకుంటాం

  • హైకోర్టు నూతన న్యాయమూర్తుల భరోసా

  • నిల్చున్న సీనియర్లకు కుర్చీలు ఇవ్వాలి

  • జూనియర్‌ న్యాయవాదులకు సూచన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ -ఏఐ) ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అది భావోద్వేగాలను అర్థంచేసుకోలేదని, కానీ తాము కష్టాలను, బాధలను అర్థంచేసుకుంటామని హైకోర్టు నూతన జడ్జీలు చెప్పారు. ధర్మంవైపు నిలబడడానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ మొహియుద్దీన్‌, జస్టిస్‌ చలపతిరావు, జస్టిస్‌ రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లను సంప్రదాయం ప్రకారం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎప్పుడూ బార్‌ అసోసియేషన్‌లో భాగంగానే భావిస్తామని, ఇంత ఉన్నతులుగా తీర్చిదిద్దిన అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ను ఎప్పుడూ మర్చిపోమని పేర్కొన్నారు.


నూతనంగా వస్తున్న న్యాయవాదులు ఏఐ టెక్నాలజీని, నూతన సాఫ్ట్‌వేర్‌, ఇంటర్నెట్‌లో కొత్త పరికరాలను అందిపుచ్చుకుంటున్నారని, అయితే ఏఐ ఎప్పుడూ భావోద్వేగాలను అర్థంచేసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు న్యాయవాదులుగా ఉన్న తమకు అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు తెలుసని, భావోద్వేగాలను తాము అర్థంచేసుకోగలమని పేర్కొన్నారు. చట్టబద్ధమైన, న్యాయబద్ధమై, ధర్మబద్ధమైన వాదనవైపు నిలబడటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. సీనియర్‌ న్యాయవాదులు నిల్చొని ఉండగా వారికి కుర్చీ ఇవ్వకుండా అలాగే కూర్చోవడం తగదని జూనియర్‌ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు చూస్తుంటే తాము ఎంపిక కాలేదు.. ఎన్నికయ్యామనే భావన కలుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌, సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 05:23 AM