Nagarjuna Sagar: ఖమ్మం జిల్లా తాగునీటి కోసం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:31 AM
నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నీరు విడుదల చేశారు.

పాలేరుకు రోజూ 2,000 క్యూసెక్కులు
రైతులు నారుమళ్లకు వాడుకోవచ్చన్న అధికారులు
నాగార్జునసాగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నీరు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నింపడానికి నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకూ 1.7 టీఎంసీల నీరు విడుదల చేసినా.. పాలేరు జలాశయం నీటి మట్టం 14 అడుగులకు (మొత్తం నీటి మట్టం 24 అడుగులు) తగ్గింది. దీంతో తాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఎడమ కాల్వకు మరోసారి నీరు విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు.
ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో పోసిన నారు మడ్లు ఎండిపోకుండా రైతులు ఈ నీటిని వాడుకోవచ్చునన్నారు. ప్రతి రోజూ 2,000 క్యూసెక్కుల చొప్పున పాలేరు జలాశయం నిండేవరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 566.70 అడుగులకు (248.2946 టీఎంసీలు) చేరుకుంది. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 2,258 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు మొత్తం 4,058 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.