Medak: పిల్లలను వాగులో తోసి తానూ దూకేసిన తల్లి
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:11 AM
మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఒక తల్లి ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను వాగులో తోసేసి తానూ దూకేసింది. చివరికి ఆమె మనసు మారి పిల్లలను రక్షించే ప్రయత్నం చేయగా, అప్పటికే చిన్నారులు మరణించారు

మనసు మార్చుకుని పిల్లలను రక్షించే యత్నం
అప్పటికే మరణించిన ఇద్దరు చిన్నారులు.. తల్లి క్షేమం
మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఘటన
తూప్రాన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): భర్త మృతి చెందడం.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ భారం మోయలేని ఓ తల్లి... ఇద్దరు పిల్లలను వాగులో తోసేసి, తానూ దూకేసింది. కానీ చివరి క్షణంలో బతుకుమీద ఆశపుట్టింది. తాను ఒడ్డుకు చేరుతూ, పిల్లలను రక్షించేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేక చిన్నారులిద్దరూ నీటమునిగిపోవడంతో గుండెలు బాదుకుంటూ రోదించింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. తూప్రాన్ ఎస్సై శివానందం, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన వడ్డేపల్లి మమత తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. చిన్నమ్మ మైసమ్మ వద్ద పెరిగింది. మమతకు కొన్నేళ్ల క్రితం మాసాయిపేటకు చెందిన స్వామితో వివాహంకాగా, పూజ (7), తేజస్విని (5) ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్వామి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందడంతో.. మమత పిల్లలతో కలిసి దంతాన్‌పల్లికి వచ్చేసింది. కానీ భర్త మృతి, పిల్లల పోషణ భారం, ఆర్థిక సమస్యలతో ఆవేదనలో పడింది. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం ఉదయం పిల్లలను తీసుకుని ఇస్లాంపూర్ శివార్లలోని హల్దీవాగు వద్దకు వచ్చింది. పిల్లలను తోసేసి, తానూ దూకింది. అంతలోనే మనసు మార్చుకుని పిల్లలను రక్షించే ప్రయత్నం చేసింది. ఒడ్డుకు చేరుకుని తన చీరను విప్పి పిల్లల వైపు విసిరింది. సాయం కోసం కేకలు వేసింది. కానీ అప్పటికే పిల్లలు నీట మునిగిపోయారు. స్థానికులు దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. తూప్రాన్ ఎస్సై శివానందం హల్దీవాగులో గాలింపు చర్యలు చేపట్టి పూజ, తేజస్వినిల మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటనపై ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరు పిల్లలను వాగులో తోసినందుకు తల్లిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు.