Miss World: కీర్తి కాదు.. స్ఫూర్తి
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:01 AM
మా విజయం మాకోసం కాదు.. మాదేశంలో అణచివేతకు గురవుతున్న, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మహిళా లోకానికి స్ఫూర్తి నింపడమే మా ఉద్దేశం

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యం
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నది అందుకే!
టాప్-4లో నిలవడం గర్వకారణం
‘ఆంధ్రజ్యోతి’తో మిస్ వరల్డ్ రన్నర్‌పలు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ‘మా విజయం మాకోసం కాదు.. మాదేశంలో అణచివేతకు గురవుతున్న, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మహిళా లోకానికి స్ఫూర్తి నింపడమే మా ఉద్దేశం..’ అని మిస్ వరల్డ్ టాప్-3 రన్నర్‌పలు చెబుతున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇథియోపియా ప్రతినిధి తొలి రన్నర్‌పగా, యూరప్ ఖండం నుంచి విజేతగా నిలిచిన పోలాండ్ సుందరి రెండో రన్నర్‌పగా, అమెరికా-కరేబియన్ ఖండం నుంచి గెలిచిన మార్టినిక్ ప్రతినిధి మూడో రన్నర్‌పగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ సుందరి కిరీటం దక్కకున్నా టాప్-4లో నిలవడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నామని వారు చెప్పారు. ఆదివారం తమ అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
మాత, శిశు ఆరోగ్యం.. నా ప్రాధాన్యం
మా దేశంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన చాలా తక్కువ. తీవ్ర అనారోగ్యం బారినపడేవరకు కూడా చికిత్స తీసుకోరు. దీనిపై అవగాహన కల్పిస్తున్నా. మాయా చారిటబుల్ సంస్థతో కలిసి ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పుడు సాధించిన విజయంతో మాతాశిశు ఆరోగ్యంతోపాటు మహిళా సమానత్వం, నిరుద్యోగం, డ్రగ్స్ వంటి ప్రధాన సమస్యలపైనా పనిచేసేందుకు సిద్ధమవుతున్నాను. ఈ పోటీలతో ఇథియోపియా పేరు ప్రపంచానికి తెలిసింది. నా దేశంతో పాటు ప్రపంచ మహిళలకు స్ఫూర్తి కలిగించడమే నా జీవిత లక్ష్యం.
- హసెట్ డెరేజీ, ఇథియోపియా
మా సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తా..
పోలాండ్-భారత్ మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడికి విద్య కోసం వచ్చే భారత విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. మా దేశంలో వందకుపైగా భారతీయ రెస్టారెంట్లున్నాయి. దానితో ఇక్కడ భారతీయ వంటకాలను చాలా ఆస్వాదించా. తెలంగాణ జానపదాలను తెలుసుకోవడం మా పర్యటనలో నాకు ఎక్కువగా నచ్చిన అంశం. నేను పోలాండ్ జానపద నృత్యకారిణిని. సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ జానపద నృత్య పోటీల్లో మా దేశం నుంచి పాల్గొన్నాను కూడా. ఇప్పుడు లభించిన విసయంతో మా జానపదాలను ప్రపంచానికి పరిచయం చేస్తా.
- మాజా క్లాజ్డా, పోలాండ్
మా దేశం గురించి ప్రపంచానికి తెలిసింది
మార్టినిక్ అనే ఓ దేశం ఉందన్న విషయం ప్రపంచంలో చాలా మందికి తెలియదు. నేను మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినప్పటి నుంచి చాలా మంది మా దేశం గురించి ఆన్‌లైన్ శోధించడం ప్రారంభించారు. మిస్ వరల్డ్‌లో 3వ రన్నర్‌పగా నిలవడంతో... ఇప్పుడు మా చిన్నపాటి ద్వీప దేశం పేరు ప్రపంచానికి తెలిసింది. నా దేశం కోసం నేను సాధించిన అతిపెద్ద విజయమిది. నేను చాలా గర్వపడుతున్నాను. కేవలం 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 3.5 లక్షల జనాభా ఉన్న చిన్న ద్వీపదేశం మాది. దేశం చిన్నదే కావచ్చు. కానీ పర్యాటకులకు ఆకట్టుకునే ఎంతో అందమైన దేశం. జలపాతాలు, బీచ్‌లు, ప్రకృతి అందాలు మాకు దేవుడిచ్చిన వరం. నా విజయంతో మా దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది.
- అరేలీ జోకిమ్, మార్టినిక్