Share News

Betting Apps: మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:54 AM

మెట్రోరైల్‌ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్‌ యాప్స్‌ ప్రచారం, యాడ్స్‌ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు.

Betting Apps: మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

  • హైకోర్టుకు వెల్లడించిన అడ్వొకేట్‌ జనరల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మెట్రోరైల్‌ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్‌ యాప్స్‌ ప్రచారం, యాడ్స్‌ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు. మెట్రోరైళ్లలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై ఈడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా ప్రభుత్వం, మెట్రోరైల్‌ తరఫున ఏజీ వాదనలను వినిపించారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.


ఇకపై ఎలాంటి బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం, ప్రకటనలను స్టేషన్లలో, రైళ్లలో, రైళ్లపై లేకుండా చర్యలు తీసుకుంటామని.. ఈ మేరకు మెమో దాఖలు చేశామని ఏజీ వివరించారు. మెట్రోరైల్‌లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం, యాడ్స్‌ ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ నుంచి సమాచారం అందిన వెంటనే.. వాటిని తొలగించాలని ఎల్‌అండ్‌టీకి లేఖరాసినట్లు వివరించారు. తాము లేఖ రాసిన వెంటనే ఎల్‌అండ్‌టీ సానుకూలంగా స్పందించిందని.. యాడ్స్‌ను తొలగించిందని పేర్కొన్నారు. ఏజీ వాదనలను విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్‌లో చేపడతామని తెలిపింది.

Updated Date - Apr 30 , 2025 | 04:54 AM