Share News

CBI Investigation: మెడికల్‌ కాలేజీ నుంచి లంచం

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:33 AM

ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో తనిఖీలకు వెళ్లి.. అనేక లోపాలున్నా.. లంచం తీసుకుని, అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

CBI Investigation: మెడికల్‌ కాలేజీ నుంచి లంచం

మహిళా ప్రొఫెసర్‌పై సీబీఐ కేసు

  • తనిఖీల్లో కాలేజీకి అనుకూలంగా నివేదిక

  • రూ.లక్షల్లో లంచం ముట్టినట్లు గుర్తింపు త్వరలో విచారణ.. వైద్య శాఖలో చర్చ

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో తనిఖీలకు వెళ్లి.. అనేక లోపాలున్నా.. లంచం తీసుకుని, అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదవ్వడంతో వైద్యశాఖలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ బోధనాస్పత్రిలో ప్రొఫెసర్‌గా ఉన్న మహిళా డాక్టర్‌కు గతంలో జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘ప్రైవేటు వైద్య కళాశాలల తనిఖీకి మీరు వెళ్తారా?’’ అని ఎన్‌ఎంసీ కోరడంతో.. ఆమె అంగీకరించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో తనిఖీలు జరగ్గా.. ఆ బృందంలో ఆమె ఉన్నారు. ఆ కాలేజీలో అనేక లోపాలున్నా.. యాజమాన్యం తనిఖీ బృందాన్ని లంచంతో మేనేజ్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉదంతాలపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..! రాష్ట్రంలో దర్యాప్తులో భాగంగా మహిళా ప్రొఫెసర్‌ బాగోతం బయటపడింది. దీంతో.. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘‘రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎన్‌ఎంసీ బృందానికి లంచం ముట్టి ఉంటుంది’’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సదరు మహిళా ప్రొఫెసర్‌తోపాటు.. ఏపీ, తెలంగాణకు చెందిన పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు.. ఇలా మొత్తం 36 మందిని నిందితుల జాబితాలో చేర్చింది. ప్రభుత్వ ప్రొఫెసర్‌పై కేసు నమోదవ్వడం ఇప్పుడు వైద్యఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది.

ప్రభుత్వం సీరియస్‌!

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు మహిళా ప్రొఫెసర్‌ దక్షిణ తెలంగాణలో పనిచేసేవారు. గత ఏడాది హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. తన పలుకుబడితో రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రభుత్వాస్పత్రికి సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. అక్కడ అవకతవకలు జరగడంతో.. ఆమెను తప్పించారు. ఇప్పుడు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరుండడంతో.. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనుంది? అనే ఉత్కంఠ వైద్య ఆరోగ్య శాఖలో నెలకొంది. ఎఫ్‌ఐఆర్‌లో పేరుంటే.. శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించవచ్చని, చార్జిమెమో జారీ చేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. సీబీఐ ఆమెను విచారించి, అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అరెస్టు అయ్యి, 48 గంటల పాటు జైలులో ఉంటే.. సస్పెన్షన్‌ వేటు వేయవచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. దీంతో.. సదరు మహిళా ప్రొఫెసర్‌ వాంగ్మూలాన్ని సేకరించి, ఆమెను కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.

Updated Date - Jul 09 , 2025 | 05:33 AM