Share News

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:55 AM

బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. సోమవారం మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి..

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

బీజేపీ ఎంపీకి మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్‌

  • డీజీపీ, సంగారెడ్డి ఎస్పీకి రఘునందన్‌రావు ఫిర్యాదు

  • ‘ఆపరేషన్‌ కగార్‌’పై ఇటీవల మాట్లాడిన రఘునందన్‌

సంగారెడ్డి/కీసర, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. సోమవారం మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రఘునందన్‌ హాజరై మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఫోన్‌ చేసిన ఆగంతకుడు, ‘‘జాగ్రత్తగా ఉండు...లేదంటే నిన్ను ఈరోజే చంపేస్తాం’ అంటూ హెచ్చరించాడు. తాను ఎంపీ పీఏను మాట్లాడుతున్నానని చెప్పగానే కాల్‌ కట్‌ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ కాల్‌ చేసి, ‘‘మీ ఎంపీని ఈరోజు చంపేస్తారు. మధ్యప్రదేశ్‌ నుంచి దళాలు వస్తున్నాయి. రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. జాగ్రత్తగా ఉండమని చెప్పు’’ అంటూ హెచ్చరించాడు. రెండోసారి వచ్చిన ఫోన్‌కాల్‌ సంభాషణను రఘునందన్‌రావు రికార్డు చేయించారు. వెంటనే డీజీపీతోపాటు సంగారెడ్డి ఎస్పీకి ఫోన్‌ద్వారా ఫిర్యా దు చేశారు. కాగా, ఈ కాల్‌ను ఇంటర్నెట్‌ నుంచి చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌.. ఎంపీకి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు. ఆగంతకుడు మధ్యప్రదేశ్‌ అంటూనే స్పష్టమైన తెలుగులో మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా ఆకతాయిలు ఫేక్‌ కాల్‌ చేశారా? లేక రఘునందన్‌ అంటే పడనివాళ్లు ఈ పనికి పాల్పడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఆపరేషన్‌ కగార్‌పై మాట్లాడినందుకేనా?

మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు మద్దతుగా రఘునందన్‌రావు ఇటీవల పలు సందర్భాల్లో మాట్లాడారు. అందు కే ఆయనకు బెదిరింపు కాల్‌ వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మావోయిస్టులు తమ చేతుల్లో తుపాకులు పట్టుకొని చర్చలకు పిలవాలని కోరడం సమంజసంకాదని, ఆయుధాలు వదిలి చర్చలకు రావాలని తాను అన్నట్లుగా రఘునందన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పుకొచ్చారు. కానీ, ఫోన్‌ చేసిన వ్యక్తి ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చినప్పటికీ రఘునందన్‌ తన ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మెదక్‌ జిల్లా చేగుంట పర్యటనకు వెళ్లారు.

Updated Date - Jun 24 , 2025 | 04:55 AM