మావోయిస్టు డీవీసీఎం పద్మ లొంగుబాటు
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:13 AM
మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క సోమవారం పోలీసులకు లొంగిపోయారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య అయిన ఆమె 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు.

ములుగు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క సోమవారం పోలీసులకు లొంగిపోయారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య అయిన ఆమె 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ములుగు ఎస్పీ శబరీశ్ మీడియాకు వివరించారు. ములుగు జిల్లా తుపాకులగూడెం గ్రామంలో నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుల్సం పద్మ జన్మించారు. పీడబ్ల్యూజీ సిద్ధాంతం పట్ల ఆకర్షితురాలైన ఆమె 1998లో దళంలో చేరి 2001 వరకు ఏటూరునాగారం దళసభ్యురాలిగా పనిచేశారు.
ఆ తర్వాత 2004 వరకు మహిళా దళంలో కొనసాగి, 2005లో మహిళా దళం కమాండర్ అయ్యారు. 2005లోనే కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ను వివాహం చేసుకున్నారు. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో పలు హింసాత్మక సంఘటనల్లో పద్మ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలు పెరగడంతో ఆమె లొంగుబాటును ఎంచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దాంతో పద్మకు ఎస్పీ ఆర్థిక సాయం అందించారు.