Share News

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:28 AM

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌ అంత్యక్రియలు సొంతూరిలో అభిమానులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

  • భారీగా తరలివచ్చిన జనం

  • నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీలు సిరికొండ, తీన్మార్‌ మల్లన్న

భూపాలపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌ అంత్యక్రియలు సొంతూరిలో అభిమానులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. గురువారం రాత్రి ఏపీలోని రంపచోడవరంలో పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. దీంతో వారు శుక్రవారం ఉదయం స్వగ్రామం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు తీసుకొచ్చారు. విషయం తెలిసి వెలిశాలకు భారీగా జనంతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పౌర, ప్రజా సంఘాల నేతలు తరలివచ్చారు.


ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్‌ మల్లన్న, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే సతీమణి పుష్ప, ఆర్‌కె సతీమణి నిర్మలక్క, అరుణోదయ విమలక్క, అమరుల బంధుమిత్రుల కమిటీ, తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు తదితరులు భౌతికకాయానికి నివాళులర్పించారు. రవి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఆపరేషన్‌ కగార్‌ పేరిట సాగిస్తున్న మారణకాండను కేంద్రం తక్షణమే ఆపాలని.. దీనిపై సుప్రీం కోర్టు సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రవి సోదరుడు గాజర్ల అశోక్‌ మాట్లాడుతూ.. తమ అన్నను చిత్రహింసలు పెట్టి చంపారని.. ఆయన శవాన్ని అప్పగించేందుకు కూడా పోలీసులు తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు.

Updated Date - Jun 21 , 2025 | 04:28 AM