Manda Krishna Madiga: గ్రూప్స్ ఫలితాలను ప్రకటిస్తే ఉద్యమమే
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:11 AM
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసేవరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

వర్గీకరణ చట్టం వచ్చే వరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలి: మందకృష్ణ
పంజాగుట్ట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసేవరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గ్రూప్స్ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దన్న డిమాండ్‌తో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల(విద్యార్థి విభాగం మినహా) ఆధ్వర్యంలో ఆదివారం నుంచే నిరవధిక దీక్షలు ప్రారంభించామని చెప్పారు.
వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. దేశంలో అందరికన్నా ముందు తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను వర్తింపజేస్తామని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారంటూ గుర్తు చేశారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.