Bhatti Vikramarka: దశాబ్ది తర్వాత రేషన్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:25 AM
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీని పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

పదేళ్లు రేషన్ కార్డుల ఊసే ఎత్తని బీఆర్‌ఎస్
రాష్ట్రంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి పరుగులు: భట్టి
బోనకల్/ చింతకాని, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీని పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువురిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నదని చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా బోనకల్, చింతకాని మండలాల్లో పర్యటించారు. బోనకల్ మండల కేంద్రంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం సాగిందని, తిరిగి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన కొద్దికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.
గృహలక్ష్మి పథకం కింద 51 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. చింతకాని మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద దళిత బంధు రెండోవిడతలో రూ.4.63 కోట్లతో 214 మంది లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను మల్లు భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకూ త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. దళిత బంధు యూనిట్ల క్రయ విక్రయాలు నేరమని, వాటితో కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని హితవు చెప్పారు. అంతకు ముందు మండలంలోని గాంధీనగర్‌లో ఒక లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరిగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. జోరువానలోనూ ఆయన చింతకాని, గాంధీనగర్‌ల్లో పర్యటించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News