Vemulawada: నేటి నుంచి వేములవాడలో మహా జాతర
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:47 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగనుంది. మంగళవారం 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శివరాత్రి వేడుకలకు 4 లక్షల మంది భక్తులు!
బందోబస్తుకు 1500 మంది పోలీసులు
వేములవాడ జాతరకు 850 ఆర్టీసీ బస్సులు
సిరిసిల్ల, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగనుంది. మంగళవారం 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాజాతర కోసం రాజన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ఆర్టీసీ 850 ప్రత్యేక బస్సులు నడిపించనుంది. వేములవాడకు చేరుకున్న భక్తులను దేవస్థానం వద్దకు చేర్చడానికి 14 మినీ బస్సులను దేవస్థానం ఏర్పాటు చేసింది. వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ నుంచి గుడిచెరువు వరకు 3 రోజులు బస్సులు ఉచితంగా నడపనున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీ్‌పకుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో వినోద్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.30 గంటలకు టీటీడీ తరపున పట్టు వస్త్రాల సమర్పణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు నిశీ పూజ అనంతరం భక్తులకు స్వామి వారి లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగిస్తారు.