Telangana women Free Bus Rides: మహాలక్ష్మి.. మరో మైలురాయి
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:54 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలు రాయిని అధిగమించిందని

ఆర్టీసీలో 200 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం
ప్రయాణికులకు రూ.6,700 కోట్ల ఆదా
అధికారులు, సిబ్బందికి పొన్నం ప్రశంస
నేడు డిపోలు, బస్ స్టేషన్లలో సంబురాలు
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలు రాయిని అధిగమించిందని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారు 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం’ కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారని ఓ ప్రకటనలో పేర్కొంది. తొలినాళ్లలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌లో విద్యార్థినులు, ఉద్యోగినులతోపాటు సాధారణ మహిళలు.. రోజూ సుమారు 8 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలు సుమారు 6700 కోట్లు ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకోగా, ఒక్కో పేద కుటుంబం నెలకు 4,000-5,000 ఆదా చేసుకోగలిగింది.
మహిళలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా...
పుట్టింటికైనా.. ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికైనా.. రాష్ట్రంలో ఎక్కడికెళ్లడానికైనా మహిళలు భర్తను అడక్కుండానే స్వతంత్ర నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెంచుకుంటున్నారు. రైతు బజార్‌లో కూరగాయలమ్మే మహిళలు, ఆస్పత్రులకెళ్లే రోగులు, కాలేజీలు, ఆఫీసులకెళ్లే విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రయాణం తప్పనిసరి. వృద్ధ మహిళలు, సంపాదన లేని మహిళలకు, ప్రయాణ ఖర్చు భారంగా మారిన పేదలకు మహాలక్ష్మి పథకం ఊరటనిచ్చింది.
లబ్ధిదారులకు సీఎం అభినందనలు
మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నారు. దిగ్విజయంగా ఈ పథకం అమలులో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
డిపోలు, బస్ స్టేషన్లలో సంబురాలు
మహాలక్ష్మి పథకంలో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినందున బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ ేస్టషన్‌లలో సంబురాలు నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిపోలు, బస్ స్టేషన్‌లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారతపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. మహాలక్ష్మి పథకం విజయవంతానికి కృషి చేసిన ప్రతి డిపోలోని ఐదుగురు ఉత్తమ డ్రైవర్లు/ ఉత్తమ కండక్టర్లతోపాటు ట్రాఫిక్ గైడ్‌లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలని అధికారుల్ని మంత్రి పొన్నం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా మహాలక్ష్మి పథకం అమలు చేసి, స్ఫూర్తి ప్రదర్శించిన సంస్థ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.