Legal Hurdles Delay: వీసా గడువు ముగిసినా.. వారిని భారత్ నుంచి పంపలేం..!
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:28 AM
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్‌లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.

విదేశీ నేరగాళ్ల ‘కాంట్రాక్ట్’ పెళ్లిళ్లు
పథకం ప్రకారం గృహహింస కేసులు
అవి తేలే వరకు భారత్‌లోనే మకాం
యథేచ్ఛగా నేరాలు, మోసాలు
హైదరాబాద్ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్‌లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు. అందుక్కారణం.. వారు ఇక్కడి వారితో కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకోవడం.. వారిపై గృహ హింస కేసులుండడమే..! సాధారణంగా క్రిమినల్ కేసుల్లో కోర్టులు పాస్‌పోర్టులను సీజ్ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో విదేశీయులను వెనక్కి పంపడంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత.. కాంట్రాక్ట్ పెళ్లిళ్ల పేరుతో భారత్‌లో మకాం పెట్టిన విదేశీయులు.. ముఖ్యంగా విదేశీ నేరస్థుల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కాంట్రాక్టు పెళ్లిళ్లతో..
ఒక్కప్పుడు అరబ్బు షేక్‌లు కాంట్రాక్ట్ పెళ్లిళ్ల కోసం హైదరాబాద్ వచ్చేవారు. ఇక్కడి అమ్మాయిలను భారీ కన్యాశుల్కం ఇచ్చి, పెళ్లి చేసుకునేవారు. ఒకట్రెండు నెలలు ఇక్కడే గడిపి, వెళ్లిపోయేవారు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు భారత్‌లో చట్టబద్ధం కాదు. ఇప్పుడు సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియా ముఠాలు, డ్రగ్స్ గ్యాంగ్‌లు, ఇతర విదేశీ మోసగాళ్లు భారత్‌లో తిష్ఠ వేసేందుకు కాంట్రాక్టు పెళ్లిళ్లను వరంగా మార్చుకున్నారు. విదేశీ నేరగాళ్లు వ్యూహం ప్రకారం ఇక్కడి మహిళలను కాంట్రాక్టు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత తమ పథకంలో భాగంగా భార్యతో స్థానిక ఠాణాల్లో గృహ హింస కేసు పెట్టిస్తారు. అంతే.. కౌన్సెలింగ్‌కు భర్త (విదేశీ నేరస్థుడు) వెళ్లినా.. భార్య వెళ్లదు. అలా కేసును నెలలు, సంవత్సరాలకు పొడిగించేస్తారు. ఒకవేళ తాము ఏదైనా సైబర్, డ్రగ్స్, ఇతర కేసుల్లో అరెస్టయితే.. పోలీసులు తమను డీపోర్ట్ చేయకుండా గృహ హింస కేసులు తమను కాపాడుతాయనేది నేరగాళ్ల విశ్వాసం. ఒకవేళ ఆయా కేసుల్లో పోలీసులు అరెస్టు చేసినా.. రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చి.. మళ్లీ నేరాలకు పాల్పడుతుంటారు.
ఇవీ కొన్ని ఉదాహరణలు..
కొద్దిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో ఉంటున్న నైజీరియా సైబర్ నేరగాణ్ని అరెస్టు చేశారు. అతనిపై అప్పటికే బెంగళూరులో గృహహింస కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాంట్రాక్ట్ పెళ్లి ద్వారా అతను బెంగళూరులోనే మకాం పెట్టాడు. అతన్ని డీపోర్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయి.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ మహమ్మద్ హసీబుల్ అలియాస్ జోవన్ చౌదరి(25), రోమన్ సాహ అలియాస్ రహాన్(21)ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అక్రమంగా వచ్చిన ఇద్దరినీ డీపోర్ట్ చేసేందుకు యత్నించగా.. వారు అప్పటికే ఇక్కడి మహిళలను పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో.. వారిని తిప్పి పంపలేకపోయారు.
ఆపరేషన్ సిందూర్‌కు ముందు భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలను వెనక్కి పంపాలని పోలీసులు చేసిన ప్రయత్నాలను కాంట్రాక్టు పెళ్లిళ్లు అడ్డుకోవడం గమనార్హం..!
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News