Share News

Illicit Liquor: పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య !

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:33 AM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య (59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు.

Illicit Liquor: పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య !

  • నిమ్స్‌లో పదో తేదీన ఒకరి మృతి

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య (59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని అతని కుమారుడు శివుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కురుమయ్య అంత్యక్రియలు ఈ నెల 11న వనపర్తి జిల్లాలోని స్వగ్రామంలో నిర్వహించారు. అడ్డగుట్ట సొసైటీలోని విజేత సూపర్‌ మార్కెట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే కురుమయ్య .. కల్లు తాగి గతవారం అస్వస్థతకు గురయ్యారు.


దీంతో కుటుంబసభ్యులు అతనిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ కురుమయ్య మరణించారు. మరోపక్క, కల్తీ కల్లు బాధితులెవరూ తమ ఆస్పత్రిలో చనిపోలేదని నిమ్స్‌ వర్గాలు చెబుతుండడం గమనార్హం. కాగా, కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jul 14 , 2025 | 04:33 AM