Share News

KTR: మరో 25 ఏళ్లు ప్రజాసేవలో బీఆర్‌ఎస్‌ కొండాలక్ష్మణ్‌, జయశంకర్‌ మాకు స్ఫూర్తి: కేటీఆర్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:05 AM

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టాక.. తెలంగాణ ప్రగతికోసం నిరంతరం పాటుపడుతూ.. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్లు తన ప్రస్థానం సాగించిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: మరో 25 ఏళ్లు ప్రజాసేవలో బీఆర్‌ఎస్‌ కొండాలక్ష్మణ్‌, జయశంకర్‌ మాకు స్ఫూర్తి: కేటీఆర్‌

హైదరాబాద్‌/కవాడిగూడ/గన్‌పార్క్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టాక.. తెలంగాణ ప్రగతికోసం నిరంతరం పాటుపడుతూ.. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్లు తన ప్రస్థానం సాగించిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. 25 ఏళ్లు పూర్తిచేసుకొని.. నిర్విరామంగా కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ... అమరులు, పెద్దలు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మరో 25 ఏళ్లు తెలంగాణలో ప్రజాసేవలో కొనసాగే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ గులాబీ జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.


అనంతరం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌ వద్ద కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండాలక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్ఫూర్తితోపాటు పార్టీ అధినేత కేసీఆర్‌ అందించిన నాయకత్వమే.. 25 ఏళ్ల బీఆర్‌ఎస్‌ ప్రస్థానానికి ప్రధానం కారణమన్నారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి, కొండంత అండగా నిలిచిన కొండాలక్ష్మణ్‌ బాపూజీకి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్‌ఎస్‌ ప్రస్థానానికి ఆ ఇద్దరు ప్రముఖులు మూలస్తంభాలని కొనియాడారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ.. లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 04:05 AM