Share News

BRS: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు భేటీ!

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:17 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు సోమవారం సమావేశమయ్యారు.

BRS: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు భేటీ!

  • తాజా పరిస్థితులపై సుదీర్ఘ చర్చ

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని నంది నగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో జరిగిన ఈ భేటీలో తాజా పరిస్థితులు, ఇటీవలి పరిణామాలు, ఇతర కీలకాంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్‌ తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయి పరిణామాలపై పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఇటీవల మరోసారి కాళేశ్వరం కమిషన్‌ను కలిసి అదనపు సమాచారం ఇచ్చిన సంగతిని కేసీఆర్‌కు హరీశ్‌రావు వివరించారని విశ్వసనీయంగా తెలిసింది.


కాగా, పార్టీ పటిష్టతకు బీఆర్‌ఎస్‌ శ్రేణులతో చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలపై కేటీఆర్‌, హరీశ్‌ రావుకు పలు సూచనలు చేసిన గులాబీ బాస్‌.. పార్టీ అనుబంధ సంఘాలకు శిక్షణలిచ్చి..బలోపేతం చేయాలని హితవు చెప్పారు. ఈ నెల 19న బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం కార్యకర్తలకు ఉప్పల్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శిక్షణ చేపట్టాలని కేసీఆర్‌ సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే వర్క్‌షా్‌పను హరీశ్‌ రావు ప్రారంభిస్తే.. సాయంత్రం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముగించాలని అధినేత కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామాలపైనా వారు ముగ్గురు చర్చించినట్లు తెలియవచ్చింది.

Updated Date - Jul 15 , 2025 | 05:17 AM