KTR: రేవంత్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:41 AM
కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక ఆధారంగా లగచర్ల, పరిగి ఘటనలపై తీవ్ర విమర్శలు చేశారు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక సీఎంకు చెంపపెట్టు : కేటీఆర్
అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నివేదిక చెంపపెట్టులాంటిదని.. ఆయనకు సిగ్గుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లగచర్ల దళిత, గిరిజన ఆడబిడ్డలను పోలీసులు వేధింపులకు గురిచేశారని మానవ హక్కుల కమిషన్ తేల్చిందన్నారు. పరిగి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు రైతుల్ని విపరీతంగా కొట్టారని, పైగా ఈ విషయాన్ని మెజిస్ట్రేట్‌కు చెబితే మీ ఇంట్లోవాళ్లను కూడా తీసుకొచ్చి కొడతామని బెదిరించారన్నారు. ఘటన జరిగిన రోజు అక్కడలేని వ్యక్తులను, ఆ సంఘటనతో సంబంధంలేని రైతులను కూడా తీసుకొచ్చి పోలీసులు కొట్టారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
బాధ్యులైన పోలీసులపై ఆరు వారాల్లోపు చర్యలు తీసుకోవాలని, వారిని సర్వీ్‌స నుంచి తొలగించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని, ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిందన్నారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలపై పోలీసుల దాష్టీకానికి హోం మంత్రిగానూ వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, రేవంత్‌రెడ్డికి ప్రైవేటు సైన్యంలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులను, ఆశాఖ అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు.