Congress: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:00 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, 90 శాతం స్థానాలు కైవసం చేసుకుంటామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

90% కైవసం చేసుకుంటాం: కోమటిరెడ్డి
కాంగ్రె్‌సతోనే న్యాయం: దామోదర
బీఆర్‌ఎస్ పాలనలో అధోగతి: జూపల్లి
ఆమనగల్లు, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, 90 శాతం స్థానాలు కైవసం చేసుకుంటామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలంతా కష్టాల నుంచి వైదొలిగి సంతోషంగా ఉన్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో శుక్రవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డిలతో కలిసి మాడ్గుల మండల కేంద్రంలో రూ.12.70 కోట్లతో నూతనంగా నిర్మించే 30 పడకల ఆస్పత్రి భవనానికి మంత్రి దామోదర శంకుస్థాపన చేశారు. ఆమనగల్లు మండలం కోనాపూర్ నుంచి మాడ్గుల మండల కేంద్రం వరకు రూ. 45 కోట్లతో చేపట్టే, మాడ్గుల నుంచి అందుగులకు రూ.30 కోట్లతో నిర్మించే బీటీ డబుల్ రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 220 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. అనంతరం వాసవి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె్‌సకు విజయసోపానమన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం నెరవేరుస్తూ 18 నెలల పాలనలో ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని ఆయన చెప్పారు. మంత్రి దామోదర మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రె్‌సతోనే సాధ్యమని అన్నారు. కల్వకుర్తిలో రూ.45కోట్లతో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నామని, కడ్తాల్, తలకొండపల్లిలో 30 పడకల పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పేదల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంత అండగా ఉంటే మరింత అభివృద్ధి చేయడానికి వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులకే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.6500 కోట్ల వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, అయినా దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు. 18నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధించిందని మరో మూడున్నరేళ్లలో అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News