Share News

Kishan Reddy: పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:08 AM

వక్ఫ్‌ బోర్డుకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నా, వాటి ఆదాయం పేద ముస్లింలకు దక్కడం లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ

  • తెలంగాణలో వక్ఫ్‌ బోర్డుకు రూ.5 లక్షల కోట్ల ఆస్తులు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డుకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నా, వాటి ఆదాయం పేద ముస్లింలకు దక్కడం లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. పేద ముస్లింల హితం కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘వక్ఫ్‌ సుధార్‌ జనజాగరణ అభియాన్‌’ వర్క్‌షా్‌పలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డుకు తెలంగాణవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నాయని, వాటిపై ఎంత ఆదాయం వస్తుందో సీఎం రేవంత్‌రెడ్డి, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణలో వక్ఫ్‌ బోర్డు పరిధిలోని ఆస్తుల ద్వారా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యముందా? అని అసదుద్దీన్‌ ఒవైసీ, రాహుల్‌లకు సవాల్‌ చేశారు. అసదుద్దీన్‌ ఓవైసీ, కాంగ్రెస్‌ నాయకులు చెప్పినట్లు వక్ఫ్‌ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మసీదుల నిర్వహణ వేరు, వక్ఫ్‌ భూముల నిర్వహణ వేరని, ఈ రెండింటిని కలిపి చెప్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. వక్ఫ్‌ బోర్డు పరిధిలో మసీదులు ఉండవని, వాటికి వేరే కమిటీలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎండోమెంట్‌ భూములు వేరని, టెంపుల్‌ కమిటీలు వేరని, ఈ విషయాలను లింక్‌ చేయొద్దని కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 18 , 2025 | 04:08 AM