Share News

Kidney Disease: కిడ్నీలు జరభద్రం

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:29 AM

దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల(సీకేడీ)తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, పొగాకు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతోందని..

Kidney Disease: కిడ్నీలు జరభద్రం

దేశంలో పెరుగుతున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితుల సంఖ్య

  • హైబీపీ, మధుమేహ రోగులు, పొగాకు వాడేవారిలో అధికం

  • 46 ఏళ్లు దాటితే ముప్పు ఎక్కువ

  • భారత్‌, ఉజ్బెకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాల్లోని 25 నగరాల్లో5వేల మందికి ‘నెఫ్రోప్లస్‌’ నిర్వహించిన స్ర్కీనింగ్‌లో వెల్లడి

  • తెలంగాణలో పరీక్ష చేయించుకున్న వారిలో 9% బాధితులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల(సీకేడీ)తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది! మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, పొగాకు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతోందని.. అలాగే, 46 ఏళ్లు దాటినవారిలో కూడా మూత్రపిండ వ్యాధుల ముప్పు పెరుగుతోందని.. ప్రముఖ డయాలసిస్‌ కేర్‌ నెట్‌వర్క్‌.. ‘నెప్రోప్లస్‌’ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రారంభ దశల్లో లక్షణాలు పెద్దగా కనపడకపోవడంతో.. చాలా మంది తమకున్న సమస్య గురించి తెలుసుకోలేకపోతున్నారని, చివరి దశలో బయటపడడంతో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని నెఫ్రో ప్లస్‌ సహ వ్యవస్థాపకుడు కమల్‌ డి షా, సీఈవో రోహిత్‌సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రిషభ్‌ ష్రాఫ్‌ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు తమ అధ్యయన వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కిడ్నీ వ్యాధులకు సంబంధించి.. భారతదేశం, ఫిలిప్పీన్స్‌, ఉజ్బెకిస్తాన్‌లోని 25 నగరాల్లో ఈ ఏడాది మార్చి 6 నుంచి 11 దాకా విస్తృత స్ర్కీనింగ్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆ ఐదురోజుల్లో.. 10వేల మందికిపైగా వ్యక్తులకు కిడ్నీవ్యాధులపై అవగాహన కలిగించామని, 5000 మందికి పైగా వ్యక్తులకు కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలిపే సీరం క్రియాటినైన్‌ పరీక్షలు చేయించినట్లు వివరించారు.


ఇతర రాష్ట్రాల్లో..

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్యను రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే.. స్ర్కీనింగ్‌లో పాల్గొన్న వారిలో అత్యధికంగా 25 శాతంతో ఝార్ఖండ్‌ అగ్రస్థానంలో ఉంది. హరియాణా (17%), ఉత్తరాఖండ్‌ (17%), ఆంధ్రప్రదేశ్‌ (16%) బిహార్‌ (15%), ఢిల్లీ (15%), కర్ణాటక (15%), మహారాష్ట్ర (15%), ఉత్తరప్రదేశ్‌ (14%), గుజరాత్‌ (9%), రాజస్థాన్‌ (9%), తెలంగాణ (9%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే అజంగఢ్‌ (28%), రాంచీ (25%) వంటి నగరాల్లో కిడ్నీవ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. పంచకుల (23%), విశాఖపట్నం (23%), జముహర్‌ (22%), హల్ద్వానీ (19%), లఖ్‌నవూ (19%), బెంగళూరు (16%), ఢిల్లీ (15%), మంగళూరు (14%), నాగ్‌పూర్‌ (14%), హిసార్‌ (11%), డెహ్రాడూన్‌ (10%), గోరఖ్‌పూర్‌ (10%), రాజమండ్రి (10), జైపుర్‌ (9%), పట్నా (9%), మోతిహరి (9%), వడోదర (6%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

మరికొన్ని లెక్కలు..

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది క్రమం తప్పకుండా నొప్పి నివారణ మందుల వినియోగిస్తున్నారని, 23ు మందికి అధిక రక్తపోటు ఉందని, 22 శాతం మందికి మధుమేహం ఉందని, 21 శాతం మంది పొగాకు వినియోగదారులని నెఫ్రోప్లస్‌ నివేదిక వెల్లడించింది. పరీక్షించిన వారిలో 60 శాతం మంది పురుషులు అయినప్పటికీ, మహిళ్లలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలిపింది. మొద ట్లో లక్షణాలు అంతగా కనిపించవని.. కాబట్టి తరచుగా పరీక్షలు చేయించుకుంటే, సమస్యను ముందే గుర్తించవచ్చని నెఫ్రోప్లస్‌ సహవ్యవస్థాపకుడు కమల్‌ షా సూచించారు. అలా గుర్తించడానికి ప్రభుత్వాలు రూ.60 కోట్లు వెచ్చిస్తే.. మూడేళ్లకాలంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై డయాలసిస్‌ ఖర్చుల భారాన్ని రూ.1100 కోట్ల మేర తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ర్టాల్లో ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 16 శాతం, తెలంగాణలో 9 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణలో దాదాపు 200 మందికి పరీక్షలు చేయగా.. హైదరాబాద్‌లో 9 శాతం, మహబూబ్‌నగర్‌లో 9 శాతం మంది బాధితులున్నట్లు తమ సర్వేలో గుర్తించినట్లు నెఫ్రోప్లస్‌ యాజమాన్యం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 200 నుంచి 300 మందికి పరీక్షలు నిర్వహించగా.. విశాఖపట్నంలో ఏకంగా 23 శాతం, రాజమండ్రి 10 శాతం మంది సీకేడీ బాధితులున్నట్లు తేలింది.

Updated Date - Jul 09 , 2025 | 05:29 AM