Share News

Dy CM Bhatti Vikramarka: ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ తెలంగాణ పథకాలు: డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:16 PM

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక పథకాలు తీసుకు వచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా.. వారికి జవాబుదారీగా తమ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Dy CM Bhatti Vikramarka: ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ తెలంగాణ పథకాలు: డిప్యూటీ సీఎం
TG Dy CM Mallu Bhatti Vikramarka

ఖమ్మం, జులై 06: ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా.. వారికి జవాబుదారీగా తమ ప్రభుత్వం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు రాదని వివిధ పార్టీల నేతలు గతంలో అన్నారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ అందించేందుకు రూ. 17,500 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మిగిలే నగదు.. పిల్లల చదువు కోసం వినియోగించుకో వచ్చని మహిళలకు సూచించారు. ఆ మొత్తం నగదును ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్‌గా తీసుకుంటున్నాయని వివరించారు.


పిల్లల భవిష్యత్ ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని.. అవి వచ్చే ఏడాదికి పూర్తవుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పాలనలో ఇళ్లు ఇవ్వలేక పోయిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్ళు ఇస్తామని ఆ నాడు చట్ట సభలో ప్రకటించామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైన వారు వేగంగా నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అధికారులు సమన్వయంతో ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు.


ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇళ్ళు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4, 50, 000 ఇళ్లు ఇస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏ ఒక్క ఊర్లో ఇవ్వలేదని విమర్శించారు. నాలుగు నెలలు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండలన్నదే తమ లక్ష్యమన్నారు.


ఏకాదశి రోజున పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మీ ఓటు వృధా కానివ్వనని గతంలో తాను మాటిచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా ఉండి.. ప్రతి రూపాయి పొగేసి పేదలకు ఎలా పంచాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి 12 లక్షల కుటుంబాలు ఉంటే.. రేషన్ కార్డులున్న 95 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. రూ.13,500 కోట్లు సన్న బియ్యం కోసం కేటాయించామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు.


రూ. 21,500 కోట్ల నగదును మహిళలకు వడ్డీ లేని రుణాలుగా అందిచామని వివరించారు. గత ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు సైతం ఇవ్వలేదన్నారు. రూ. 6 వేల కోట్ల నగదును మహిళల ఉచిత బస్సు ప్రయాణం కింద ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రూ. 21 వేల కోట్ల మేర నగదును మూడు నెలల్లోనే రుణ మాఫీ చేసిన ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.


9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చిన చరిత్ర తమ ప్రభుత్వానిదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారికి ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. ఇంకా 30 వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ధనిక రాష్ట్రంలో ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాలను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆ పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 09:40 PM