Kavitha: బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:05 AM
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

ఇందిరా పార్కు వద్ద ఆగస్టు 4 నుంచి 7 వరకు నిర్వహణ
ఆర్డినెన్స్, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు?: ఎమ్మెల్సీ కవిత
పంజాగుట్ట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌లో ఆగస్టు 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. హైకోర్టు చెప్పిన గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమూ అంతే ముఖ్యమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకపోవడం, బీసీ బిల్లులపై రాష్ట్రపతి స్పందించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదని ప్రశ్నించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం యునైటెడ్ ఫూలే ఫ్రంట్(యూపీఎఫ్), బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే సమయంలో అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీనే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుళ్లకుండా, పార్టీ పరంగా ధర్నా చేస్తామని చెప్పడం బీసీలను వంచించడమేనని ధ్వజమెత్తారు.