Kavitha: అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:50 AM
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.

ఇందిరా పార్కు వద్ద దీక్షలో ఎమ్మెల్సీ కవిత
కవాడిగూడ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులు, కార్మికులు పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో చాలా ప్రమాదమని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాదని, ఎనుముల ఇంటెలిజెన్స్ అని ఆమె పేర్కొన్నారు. ఎనుముల ఇంటెలిజెన్స్‌తోనే రాష్ట్రానికి ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిల్లు ఆమోదించి నాలుగు వారాలైందని, అది గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉందా, లేక రాష్ట్రపతికి పంపించారా అనే విషయం ప్రజలకు తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళతామని సీఎం చెప్పారని, కానీ బీజేపీని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదన్నారు. దానికి బదులుగా ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని, దానికి రాహుల్ గాంధీ వస్తారని చెప్పినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు.