Share News

Kavitha: అనర్హుడిగా ప్రకటించాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:28 AM

తీన్మార్‌ మల్లన్న బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి.. ఆడబిడ్డ అనే విచక్షణ లేకుండా తనపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha: అనర్హుడిగా ప్రకటించాలి

  • ఎమ్మెల్సీ మల్లన్నపై మండలి చైర్మన్‌కు కవిత ఫిర్యాదు

  • నన్నే ఇలా అంటే సాధారణ మహిళల పరిస్థితేంటి?

  • దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకుంటే మల్లన్నతో

  • ఆయనే మాట్లాడించినట్లు భావించాల్సి వస్తుంది

  • నిరసన తెలిపితే కాల్పులు జరుపుతారా?: కవిత

  • మల్లన్న, ఆయన గన్‌మెన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి

  • డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తీన్మార్‌ మల్లన్న బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి.. ఆడబిడ్డ అనే విచక్షణ లేకుండా తనపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అయిన తనపైనే ఇలా మాట్లాడితే రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితేంటని ప్రశ్నించారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీకి రెఫర్‌ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తోటి ఎమ్మెల్సీ, మహిళ అని చూడకుండా మల్లన్న తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలన్నారు. బీసీ అయినంత మాత్రాన.. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ‘‘నన్ను బయట తిరగనివ్వను అనడానికి మల్లన్న ఎవరు? దీనిపై ఎంతదూరమైనా వెళ్తాను. మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాను. నాపై మల్లన్న తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆవేశంతో.. జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్లారు. అంతమాత్రాన వారిపై తుపాకులతో కాల్పులు జరుపుతారా? మనుషులను చంపేస్తారా?’’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తున్నామని, ఒక ఆడబిడ్డ ప్రశ్నిేస్త సహించలేకపోతున్నారా? అని నిలదీశారు. ఏనాడూ ఒక్కమాట కూడా అనని తనను మల్లన్న ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తక్షణమే మల్లన్నను అరెస్ట్‌ చేయించాలని, లేదంటే ముఖ్యమంత్రే వెనక ఉండి మాట్లాడించినట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు.


మల్లన్నపై హత్యాయత్నం కేసు పెట్టాలి..

తెలంగాణలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ.. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఈ సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి పదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మరోవైపు తీన్మార్‌ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో ఏఐజీ రమణకుమార్‌కు కవిత ఫిర్యాదు చేశారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై గన్‌మెన్లతో కాల్పులు జరిపించిన మల్లన్నపై, ఆయన గన్‌మెన్లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ మల్లన్న గన్‌మెన్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలని, ఆయనకు ఇచ్చిన గన్‌మెన్ల భద్రతను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. తన ఫిర్యాదును తీసుకోవడానికి డీజీపీ అందుబాటులో లేకపోవడాన్ని గమనిస్తుంటే తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యల వెనుక ప్రభుత్వం ఉందా అని అనుమానించాల్సి వస్తోందన్నారు.


కవిత ఎపిసోడ్‌పై స్పందించని బీఆర్‌ఎస్‌ పెద్దలు

కవితపై తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు, తెలంగాణ జాగృతి శ్రేణులు ఆయన కార్యాలయంపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏమాత్రం స్పందించలేదు. కవిత శాసనమండలి చైర్మన్‌ను కలసి తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలోనూ ఈ అంశం విస్తృతంగా ప్రచారమైంది. కానీ బీఆర్‌ఎస్‌ పెద్దలు, ఇతర కీలక నాయకులు ఏమాత్రం స్పందించలేదు. ఓ మహిళా ఎమ్మెల్సీగానైనా ఆమెకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు మద్దతుగా స్పందించకపోవడం బాధాకరమని తెలంగాణ జాగృతి కార్యకర్తలు వాపోతున్నారు. అయితే ఈ వ్యవహారంపై మండలి బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పందించారు. మల్లన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో వ్యవహరించడం మంచిదని సూచించారు. మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం

రాజకీయ న్యాయానికి భరోసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 03:28 AM