Share News

Karreguttalu Operation: కర్రెగుట్టల్లో బలగాల ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:33 AM

కర్రెగుట్టలలో జవాన్లకు తీవ్ర వెచ్చని వాతావరణం కారణంగా డీహైడ్రేషన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, శనివారం 100 మంది జవాన్లు తిరిగి వెళ్లిపోయారు, అలాగే కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని వదంతులు ప్రచారం జరుగుతున్నాయి

Karreguttalu Operation: కర్రెగుట్టల్లో బలగాల ఉక్కిరిబిక్కిరి

డీహైడ్రేషన్‌తో 100 మంది వెనక్కి

ఎన్‌కౌంటర్‌ జరిగిందంటూ ప్రచారం

నిర్ధారించని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు

క్షేత్రస్థాయిలో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన

చర్ల/వెంకటాపురం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ బలగాలకు ఇబ్బందికరంగా మారాయా? ఎండలు మండుతున్న వేళ.. ఈ ఆపరేషన్‌తో జవాన్లు నీరసించి, చతికిలపడిపోతున్నారా? కర్రెగుట్టల మధ్యన.. కీకారణ్యాలను తలపించే అడవుల్లో మావోయిస్టులు తలదాచుకోగా.. జవాన్లు వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురవుతున్నారా? మూడ్రోజులుగా తెలంగాణవైపు వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్‌ వైపు పూజారి కాంకేర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెబుతున్నాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల మధ్యన ఉన్న అడవులు పచ్చదనంతో అలరాడుతుండగా.. గుట్టల బయట వెలుపలి వైపు మాత్రం ఆకురాలిపోయి ఎండిన చెట్లు నిలువ నీడను కూడా ఇవ్వడం లేదు. రోజుల తరబడి నడక ఒకవైపు.. తీవ్ర చెమటలు, ఉక్కబోతతో ఇబ్బందులకు గురవుతున్న జవాన్లు డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వైపు హెలికాప్టర్‌ ద్వారా బలగాలకు నిత్యావసరాలు, తాగునీరు, ఇతర సామగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్నా.. ఛత్తీస్‌గఢ్‌ వైపు ఆ తరహా సరఫరాకూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. గురువారం 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు.


తాజాగా మరికొందరు జవాన్లు కూడా డీహైడ్రేషన్‌, జ్వరం కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఎండకు తోడు మందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో జవాన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌ వైపు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ‘ఆంధ్రజ్యోతి’ ఈ ప్రాంతంలో క్షేత్రపర్యటనలో ఉండగా.. శనివారం సుమారు 100 మంది డీఆర్‌జీ జవాన్లు వెనుదిరగడం కనిపించింది. వారంతా బీజాపూర్‌, సుకుమా క్యాంపులకు తిరిగి వెళ్లారని సమాచారం. అయితే.. అస్వస్థతకు గురవ్వడంతో వారిని వెనక్కి పంపారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పూజారి కాంకేర్‌ వైపు రాత్రిళ్లు జవాన్ల బస కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిసింది. దోమలు, విషకీటకాలతో బలగాలకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని సమాచారం. కర్రెగుట్టల చుట్టూ సుమారు 4 వేల మంది జవాన్లు మోహరించినా.. చాలా మంది వేడి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. శనివారం ఉదయం నుంచి కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని, 38 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే.. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. కేవలం సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులేనని కొట్టిపారేశారు.


వెయ్యి మంది తలదాచుకునే గుహ

కర్రెగుట్టల్లో వెయ్యి మంది తలదాచుకునే వీలున్న ఓ భారీ గుహను భద్రతాబలగాలు శనివారం గుర్తించాయి. ఆ గుహలోనే నీటి సదుపాయం ఉన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి. లోపల నిత్యావసరాలున్నాయని, బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు పారిపోయి ఉంటారని పేర్కొన్నాయి. కర్రెగుట్టల్లో ఇలాంటి గుహలు ఎన్నో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశాయి.

Updated Date - Apr 27 , 2025 | 04:33 AM