Kapil Dev Quality Education; నాణ్యమైన విద్యతోనే ప్రపంచస్థాయి గుర్తింపు
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:02 AM
నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు.

విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించాలి
కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు సాధ్యం
ముచ్చింతల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే రోజు 800 అడ్మిషన్లు అద్భుతం : కపిల్‌దేవ్
శంషాబాద్‌రూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పాఠశాల దశ నుంచే నేర్పించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం సమావేశంలో కపిల్‌దేవ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ఇక్కడికి వచ్చిప్పుడు వసతులేమీ లేవని, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్‌కు మించిన వసతులను ఏర్పాటు చేశారని కొనియాడారు. కృషి ఫౌండేషన్ సహకారంతో ఈ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఒకేరోజు ఈ పాఠశాలలో 800మంది విద్యార్థులు చేరడం మమూలు విషయం కాదని, రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్‌గా ముచ్చింతల్‌ను చూస్తామని అన్నారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. తమ అన్న జూపల్లి రామేశ్వర్‌రావు స్ఫూర్తితోనే సమాజసేవలోకి వచ్చామని జూపల్లి జగపతిరావు చెప్పారు. నిరుపేద కుంటుంబం నుంచి వచ్చామని, ఈ రోజు ఎంతో ఎత్తుకు ఎదిగాం కాబట్టే సమాజనికి సేవ చేయాలనే ఉద్దేశంతో పేదల పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రూ.2.10 కోట్లతో అదనపు తరగతి గదులను 28 రోజుల్లో నిర్మించామని చెప్పారు. ఈ గ్రామాన్ని భవిష్యత్‌లో ఎడ్యూకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
నెల రోజుల్లో భవనం నిర్మాణం
ముచ్చింతల్‌లోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుం కట్టిన మైహోం గ్రూప్ గత విద్యాసంవత్సరం తన వంతుగా అదనపు తరగతి గదులను నిర్మించింది. 1 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఈ బడిలో విద్యార్థుల సంఖ్య 360కి పెరిగింది. ఎక్కువ మంది విద్యార్థులు చేరేవిధంగా సంస్థ ఈ విద్యాసంవత్సరం వినూత్న ప్రచారానికి స్వీకారం చుట్టింది. ముచ్చింతల్ చుట్టుపక్కల 24 గ్రామాల విద్యార్థుల కోసం 2 బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని.. వేసవి సెలవుల్లో ఊరూరా తిరుగు తూ ప్రచారం చేసింది. అంతే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. 2024 జూన్ 12న 800 మంది ఈ పాఠశాలలో చేరారు. వీరంతా ప్రైవేటు స్కూళ్లను వదిలివచ్చినవారే. ఒకేసారి విద్యార్థుల సంఖ్య 1160కి చేరడంతో.. మరిన్ని తరగతి గదుల అవసరం ఏర్పడింది. దీంతో 2.10 కోట్లతో అదనపు తరగతి గదులను కేవలం 28 రోజుల్లో నిర్మించి ఇచ్చారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 22 మంది టీచర్లు ఉండగా.. వీరిలో 14 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు. మిగతా టీచర్లకు మైహోం గ్రూప్ వేతనాలు చెల్లిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News