పీజీ రేడియాలజీ పరీక్షకు పాత ప్రశ్నపత్రం
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:21 AM
పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోమారు వెలుగుచూసింది.

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం
వరంగల్ మెడికల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోమారు వెలుగుచూసింది. 2023 నవంబరునాటి పరీక్షకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే ఈ నెల 16న జరిగిన పేపర్3 పరీక్షలో ఇచ్చారు. అది కూడా అప్పటి కోడ్ నంబరుతోనే ఇవ్వడం గమనార్హం. గత ప్రశ్నపత్రమే మళ్లీ రావడంతో విద్యార్థులు విస్మయానికి గురయ్యారు. గతంలో ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో కూడా మొదటి సంవత్సరం విద్యార్థులకు బయో కెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లలో సిలబ్‌సలో లేని ప్రశ్నలు వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అన్ని రకాల వార్షిక పరీక్షలకు నిపుణులతో పరీక్ష పేపర్‌ను తనిఖీ చేయిస్తారు. పరీక్షల నియంత్రణ అధికారితోపాటు సదరు సబ్జెక్టుకు సంబంధించిన మోడరేటర్ 9 గంటలకు పరీక్ష ఉంటే 8 గంటలకల్లా విశ్వవిద్యాలయంలో పరీక్ష పత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి అనంతరం పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు ఆన్‌లైన్ ద్వారా విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలకు పేపర్‌ను పంపాలి. ఇంత పకడ్బందీగా జరగాల్సిన ప్రక్రియ విషయంలో కాళోజీ విశ్వవిద్యాలయం విఫలమవుతోందని, ఫలితంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలి...
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పదేళ్లుగా తిష్ట వేసిన అధికారులు విధులు, పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఎలాంటి నియామక నోటిఫికేషన్ లేకుండానే ఓ దంత వైద్యుడు పరీక్షల నియంత్రణ అధికారిగా కొనసాగుతున్నారు. పదవీ విరమణ పొందిన అధికారులంతా ఒకచోట చేరి వర్సిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్హత లేని ఉద్యోగులను వెనక్కి పంపాలని, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టి, వర్సిటీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.