Kaleshwaram Project: నివేదికపై త్రిసభ్య కమిటీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:24 AM
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

మూడు శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు
అధ్యయనం చేసి, సారాంశం సిద్ధం చేసే బాధ్యత
4న ఏకైక ఎజెండాతో మంత్రివర్గ సమావేశం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చ
తదుపరి చర్యలపై విధాన నిర్ణయం
పరిశీలించి.. సారాంశం సిద్ధం చేసే బాధ్యత
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యద ర్శి రెండ్ల తిరుపతి సభ్యులుగా ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ.. నివేదిక ను అసాంతం పరిశీలించి సారాంశాన్ని (జిస్ట్) సిద్ధం చేయనుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ఏయే చర్యలు తీసుకోవచ్చుననే కోణంలో న్యాయశాఖ కార్యదర్శి అధ్యయనం చేయనుండగా, ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన నష్టం తీవ్రతను నీటిపారుదల ముఖ్యకార్యదర్శి అంచనా వేయనున్నారు. ఇక నివేదిక ఆధారంగా ముందుకెళ్లడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలపై జీఏడీ ముఖ్యకార్యదర్శి దృష్టి సారించనున్నారు. ఈ మేరకే మూడు రంగాలకు చెందిన అధికారులను కమిటీలో చేర్చారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాత్రమే చర్చించేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ నెల 4న మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా, శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నివేదిక రెండు ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. సీల్డ్ కవర్‌లలో నివేదిక ప్రతులను నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ అందజేశారు. ఆ వెంటనే కమిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4న మంత్రివర్గ సమావేశంలో నివేదిక సారాంశాన్ని కమిటీ అందించనుంది. దాని ఆధారంగా.. ఏయే చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. క్రిమినల్ కేసులు పెట్టాలా? లేక నేరపూరిత నిర్లక్ష్యం కింద కేసులకు ఉపక్రమించాలా? అనే దానిపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించాక ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో 4న జరుగనున్న మంత్రివర్గ సమావేశం కీలకం కానుంది. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు లేకపోలేదు. శాసనసభలో ప్రత్యేకంగా దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని సమాచారం.
చర్యలు చేపడితే ఇదే తొలి నివేదిక..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం బ్యారేజీలపై ఒక కమిషన్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మరో కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ నివేదికను జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ఇప్పటికే సమర్పించగా.. దీనిపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించింది. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై కూడా నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీనిని అమలు చేస్తే ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అమలైన తొలి నివేదికగా ఇది రికార్డులకు ఎక్కనుంది. విద్యుత్ నివేదిక చేతికి అందిన క్రమంలో.. కాళేశ్వరం నివేదిక అందిన తర్వాత రెండింటిని కలిపి అమలు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. గతంలో పలు కమిషన్లు వేసినా.. వాటి నివేదికలేవీ అమలైన దాఖలాల్లేవు. దాంతో ఈ రెండు నివేదికల అమలు కార్యరూపం దాల్చుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏలేరు కాలువకు సంబంధించిన భూకుంభకోణంపై జస్టిస్ సోమశేఖర కమిషన్ వేయగా.. ఆ కమిషన్ రెండు దఫాలుగా విచారణ జరిపింది. అయితే నివేదిక ఇవ్వడానికి ముందే ఆ కమిషన్ ఏర్పాటును కొట్టివేస్తూ హైకోర్టు అప్పట్లో తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని విచారణ నుంచి తప్పిస్తూ కొన్ని నెలల కిందట సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే జస్టిస్ మదన్ భీంరావు నివేదిక అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News