Share News

Kaleshwaram Project: 3 బ్యారేజీలు ప్రమాదంలోనే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:08 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది.

Kaleshwaram Project: 3 బ్యారేజీలు ప్రమాదంలోనే..

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల యథాతథంగా పనికిరావు

  • నష్టం విస్తృతం.. సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్‌ చేయాల్సిందే

  • జియో ఫిజికల్‌ పరీక్షలు చేయకుండానే నిర్మించారు

  • మేడిగడ్డలో ఏడో బ్లాకును పూర్తిగా తొలగించాలి

  • కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ, నాణ్యతా లోపాలే

  • సీకెంట్‌ పైల్స్‌ అమరిక సరిగాలేకే ఇసుక జారింది

  • భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల స్థలాల మార్పు

  • జాతీయ డ్యామ్‌ రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది. ఇక ఆ బ్యారేజీలు యథాతథంగా నిరుపయోగమే అన్న రీతిలో నివేదికలోని అంశాలున్నాయి. ఈ బ్యారేజీలకు జరిగిన విస్తృత, పెను నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని...సమగ్ర పునర్‌నిర్మాణం, రీడిజైన్‌ చేయాలని పేర్కొంది. నిర్మాణ లోపాలు, డిజైన్‌ లోపాలు, నాణ్యత తనిఖీ లేకపోవడం, నీటి ఒత్తిడి ఎంత అన్నదానిపై తప్పుడు అంచనాలు... అన్నీ కలిసి సీకెంట్‌ ఫైల్స్‌ కూలిపోవడం, బ్యారేజ్‌ ఎగువ, దిగువల్లో రంధ్రాలు పడ్డాయని తేల్చింది. మూడు బ్యారేజీలకు విస్తృత, పెను నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్కడితోనే ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం పూర్తి బ్యారేజీలకే ప్రమాదమని పేర్కొంది. మూడు బ్యారేజీల్లోని ప్రతి ఒక్కటి ఈ ప్రమాదపుటంచులో ఉంటాయని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఎన్‌డీఎ్‌సఏను నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిన సంగతి తెలిసిందే. పలు పరీక్షలు చేసిన అనంతరం, దాదాపు 14 నెలల అధ్యయనం తర్వాత ఎన్‌డీఎ్‌సఏ తన నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిశాంతికుమారికి పంపించింది. నివేదికలో అనేక కీలక సిఫార్సులు చేసింది. సమగ్ర పునర్‌ నిర్మాణ డిజైన్‌ చేయాలని, జియో ఫిజికల్‌ పరీక్షలు, జియో టెక్నికల్‌ పరీక్షలు చేసి, ఆధునిక హైడ్రాలిక్‌ నమూనా లు(నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనాలు)ను ఉపయోగించి ఈ పునర్‌ నిర్మాణ రీడిజైన్‌ చేయాలని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు స్థిరత్వం, స్థితిస్థాపకతను నిర్దారించేందుకు... అన్ని విభాగాల మధ్య సహకారం చాలా కీలకమని స్పష్టం చేసింది. నిర్మాణ సమయంలో నాణ్యతను తనిఖీ చేసే మంచి వ్యవస్థ లేదని, ప్రత్యేకించి కటాఫ్‌ గోడలు నీటి ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించలేదని తెలిపింది. ర్యాఫ్ట్‌కు, కటాఫ్‌ వాల్స్‌కు నేరుగా సంబంధం ఉందని చెప్పింది. బ్యారేజీలు దెబ్బతినడానికి ఈ రెండూ ప్రధాన కారణాలని తెలిపింది. బ్యారేజీపై అదే ఒత్తిడి పడితే మొత్తం బ్యారేజీ అంతా ప్రమాదంలో పడుతుందని వెల్లడించింది. మిగతా రెండు బ్యారేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్లు తెలిపింది.


కటాఫ్‌ గోడల్లో రంధ్రాలు...మిగతా బ్లాక్‌లకు ప్రమాదమే

‘‘మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో 20-21 పియర్స్‌ దగ్గర, దిగువ భాగంలో 7వ పియర్‌ దగ్గర భారీ రంధ్రాలు పడ్డాయి. బ్యారేజీ కటాఫ్‌ గోడల్లో ఇంకా కనిపించని అదనపు రంధ్రాలు ఉండి ఉండొచ్చు. ప్రాజెక్టు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు అవి బయటపడవు. ఒకసారి నీళ్లతో నిండితే అవన్నీ బయటపడతాయి. అప్పుడు బ్యారేజీలోని అన్ని బ్లాకులూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలి’ అని నివేదికలో పేర్కొన్నారు.

మేడిగడ్డ ఎందుకు కుంగిందంటే

మేడిగడ్డలో బ్లాక్‌ 7 కుంగడానికి, ర్యాఫ్ట్‌ కింద పెద్ద గుంతలు ఏర్పడటానికి అక్కడున్న మట్టి నీటి ఒత్తిడికి కొట్టుకుపోవడమే కారణమని నివేదిక తెలిపింది. పియర్‌ కుంగడానికి అక్కడున్న గేటు ఎత్తడం, నీరు రావడం కారణం కాదని తేల్చింది. 7వ బ్లాక్‌ గేట్లు అసలు పెద్దగా ఎత్తిందే లేదని, అక్కడి రికార్డుల్లోఈ విషయం నమోదై ఉందని గుర్తు చేసింది. గేట్ల నుంచి వచ్చిన నీరే కారణమై ఉంటే 6, 7 బ్లాకుల్లోని పియర్లు కూడా కుంగిపోయేవని చెప్పింది. ఏడో బ్లాక్‌లోని గేట్ల కంటే ఆరో బ్లాక్‌ గేట్లనే ఎక్కువసార్లు తెరిచారని ప్రస్తావించింది. గేట్లను ఎత్తి నీళ్లు వదలడం వల్ల సీకెంట్‌ ఫైల్స్‌ కుంగలేదని స్పష్టం చేసింది. నీళ్లు పడడం, సీకెంట్‌ ఫైల్‌ కుంగిపోవడం రెండూ సంబంధం లేని రెండు అంశాలని తేల్చిచెప్పింది.


బ్లాక్‌ 7 కుంగడానికి ప్రధాన కారణం నాణ్యతా లోపమేనని స్పష్టత ఇచ్చింది.

సీడబ్ల్యుసీ అనుమతి తీసుకున్నాకే మేడిగడ్డ ఏడో బ్లాకు పూర్తిగా నిరుపయోగంగా మారిందని, ఇవే రకమైన సమస్యలు మిగిలిన బ్లాకుల్లోనూ ఉన్నాయని నివేదిక పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించింది. మూడు బ్యారేజీలు ప్రస్తుత స్థితిలో నిరుపయోగంగా మారాయని తేల్చింది. ‘‘అన్ని రకాల పరీక్షలు/అధ్యయనాలు చేశాక దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఈ బ్యారేజీలను పునరుద్ధరణ చేపట్టాలి. ఈ బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి, దీన్ని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు తీసుకొని అమలు చేయాలి’’ అని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. ఈ పరిశోధనలు/అధ్యయనాల కోసం దేశంలోని ప్రతిష్ఠాత్మాక సంస్థల సేవలను వినియోగించుకోవాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ, నిర్వహణ, డిజైన్‌ లోపాలే కారణమని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సమయంలో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయలేదని నివేదిక ప్రస్తావించింది. ఆ పరీక్షలు చేయకుండానే రెండు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను మార్చారని ఆక్షేపించింది. 2016లో బ్యారేజీల నిర్మాణం ప్రారంభించగా, 2019లో పూర ్తయిందని, పూర్తయిన రోజు నుంచి కుంగిపోయే దాకా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) పనులే చేయలేదని ప్రస్తావించింది. కనీసం బ్యారేజీలను ఏ విధంగా నిర్మించాలనే ప్రమాణాలకు సంబంధించిన వివరాలు కూడా లేవని తప్పుపట్టింది. ఏడో బ్లాకు కుంగుబాటుకు సీకెంట్‌ పైల్స్‌ అమరిక సరిగ్గా లేకపోవడమే కారణమని, బ్యారేజీల్లో నీటి నిల్వతో ఒత్తిడి పెరిగి, పిల్లర్ల కింది నుంచి ఇసుకంతా జారి, ఏడో బ్లాకు కుంగిందని వివరించింది. మేడిగడ్డలో భారీ వరదను నిర్వీర్యం చేసే వ్యవస్థలు లేవని తెలిపింది. గేట్ల నుంచి వేగంగా దూకే వరదలో తీవ్రమైన పీడనశక్తి ఉంటుందని, ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి దిగువన టెయిల్‌పాండ్‌ను డిజైన్‌లోనే ప్రతిపాదించ లేదని వెల్లడించింది. దీనివల్ల బ్యారేజీ దిగువభాగంలో రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిని, బ్యారేజీ వైఫల్యం చెందిందని చెప్పింది. అన్నారం, సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది. ‘‘నిరంతర వరదలు, బ్యారేజీ ర్యాఫ్ట్‌(పునాది) కింద రక్షణ కోసం ఇసుక మైనింగ్‌ జరుగకుండా కట్టడి చేయలేకపోవడం వల్ల సీపేజీల కట్టడి కోసం వినియోగించిన సీకెంట్‌ పైల్స్‌ వరకు గుంతలు విస్తరించాయి. దాంతో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడంతో ర్యాఫ్ట్‌ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయి’’ అని తెలిపింది. ఏడో బ్లాకు కుంగుబాటుకు ఇదే కారణమని గుర్తు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి సరైన కారణాలు తెలుసుకోవడానికి జియో ఫిజికల్‌/జియో టెక్నికల్‌ పరీక్షలు చేయాల్సి ఉందని, గ్రౌటింగ్‌ చేయడంతో వాస్తవాలు తెలుసుకోలేక పోయామని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన బ్లాకు-7 అంతా తొలగించాలని సిఫారసు చేసింది.


పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల స్థలాల మార్పు

‘‘బ్యారేజీల నిర్మాణం చేయడానికి నిర్మాణ ప్రదేశాల్లో భూసారం తెలుసుకోవడానికి తగిన పరీక్షలు చేయాలి. అయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకచోట ప్రతిపాదించి, మరో చోటికి మార్చారు. ఈక్రమంలో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయకుండానే నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుల డీపీఆర్‌కు అనుమతి రాకముందే నిర్మాణం చేపట్టారు’’ అని నివేదిక ఆక్షేపించింది.

వానాకాలానికి ముందు, తర్వాత రిపోర్టుల్లేవు

‘‘జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి. 2022 వరదల కన్నా ముందు, తర్వాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించలేదు. నిబంధనల ప్రకారం ఈ రిపోర్టులు తయారుచేసే బాధ్యత డ్యామ్‌ ఓనర్‌దే(మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల చీఫ్‌ ఇంజనీర్‌). అయితే డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం బ్యారేజీలను పరిశీలించనే లేదు. మూడు బ్యారేజీల్లోనూ హైడ్రో మెకానికల్‌ లోపాలున్నాయి’’ అని నివేదిక గుర్తు చేసింది.


ఏడో బ్లాకునంతా తొలగించాల్సిందే

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకును పూర్తిగా తొలగించాల్సిందేనని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. డిజైన్‌, నిర్మాణ లోపాలతో ఈ బ్లాకు నిరుపయోగంగా మారిందని తేల్చింది. బ్యారేజీల వైఫల్యానికి ప్రధాన కారణాలు.

  • భీకర వరదను తట్టుకునే/నిర్వీర్యం చేసే ఏర్పాట్లు బ్యారేజీల దిగువ భాగంలో లేవు.

  • బ్యారేజీల రేడియల్‌ గేట్లు సరిగ్గా లేవు. దీనివల్ల హైడ్రాలిక్‌ జంప్‌లు చోటు చేసుకున్నాయి.

  • బ్యారేజీ నిర్మాణంలో షీట్‌పైల్స్‌ వినియోగించాలి. సీకెంట్‌ పైల్స్‌ వాడారు. సరైన అమరిక లేకపోవడంతో వీటిలో నుంచి నీరు జారి... క్రమంగా పిల్లర్ల కింది నుంచి ఇసుక జారి, బ్యారేజీ కుంగింది.

  • బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల్లో భూభౌతిక(జియో ఫిజికల్‌), భూసాంకేతిక(జియో టెక్నికల్‌) పరీక్షలు చేయలేదు.

  • మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు సమగ్రంగా విశ్లేషణ చేయడానికి బోర్‌హోల్స్‌ వేసి, సమగ్రంగా వివరాలు సేకరించాల్సి ఉండగా... గ్రౌటింగ్‌ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఫ 2019 నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దిగువ భాగంలో సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులన్నీ చెల్లాచెదురు అవుతున్నాయి. 2020, 2021లో సీపేజీ కట్టడికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. సీపేజీలకు శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక చర్యలు తీసుకోవడం విచారకరం.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 06:52 AM