Jubilee Hills assembly bypoll concluded peacefully: పోలింగ్ 50శాతం లోపే
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:32 AM
చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...
చివరిదాకా డబ్బులు పంచినా.. గడప దాటని ఓటర్
48.47శాతం పోలింగ్.. 2023 కంటే 1శాతం అధికం
కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలుచోట్ల బీఆర్‌ఎస్ నిరసనలు.. లాఠీచార్జి
కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరుల అరెసు
హైదరాబాద్ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ పలు ప్రాంతాల్లో రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారిని తర్వాత కూడా ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కడపటి సమాచారం అందే సమయానికి 48.47 శాతం పోలింగ్ నమోదైంది. తుది లెక్కల అనంతరం పోలింగ్ శాతంలో మార్పు ఉంటుందని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి దాదాపు ఒక్క శాతం మాత్రమే పెరిగింది. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ అనంతరం కాస్త పుంజుకుంది. ప్రధాన పార్టీల కార్యకర్తలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్‌కు రావాలని కోరడం పలుచోట్ల కనిపించింది. కొన్ని కేంద్రాల్లో మాత్రం నూతన ఓటర్లు, యువత ఓట్లు వేసేందుకు రావడం కనిపించింది. కొన్నిచోట్ల వయోధికులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు తరలి వచ్చారు. వారి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చెయిర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, వలంటీర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 100 ఆటోలు ఉచిత సేవలందించాయి. వయోధికులు, దివ్యాంగులను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంతోపాటు తిరిగి ఇళ్ల వద్ద వదిలేశారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సందర్శించారు. పోలింగ్ సరళి, ఏర్పాట్లపై ఆరా తీశారు. డ్రోన్‌ల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్‌ను వీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులూ పోలింగ్ సరళిని పరిశీలించారు. 4.01 లక్షల ఓటర్లున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ తరపున మాగంటి సునీతా గోపినాథ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అయితే, పోలింగ్ రోజు పరిణామాలను గమనించినా.. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పరిశీలించినా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు ఈనెల 14వ తేదీన వెలువడనున్నాయి.

నిరసనలు.. ఉద్రిక్తతలు..
కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్ల బీఆర్‌ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పలు చోట్ల పోలీసులు లాఠీచార్జీ చేశారు. పలువురిని అరెస్టు చేశారు. యూసు్‌ఫగూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్‌లో బయటి వ్యక్తులు ఉన్నారంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కౌశిక్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎర్రొళ్ల శ్రీనివాస్, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. షేక్‌పేట అల్ ఫరాహ్ స్కూల్లోని 66, 67 నంబరు పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్లను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్ డాన్ బాస్కో స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఏజెంట్లను బెదిరించి కొందరు రిగ్గింగ్ చేశారని, రీ పోలింగ్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. షేక్‌పేట అపెక్స్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలు 4, 5, 6, 7, 8లో రిగ్గింగ్ చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలపగా.. పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని పంపించేశారు. కృష్ణానగర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళన చేశారు. అంతకుముందు ఓ పోలింగ్ బూత్ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థిని లోనికి వెళ్లనివ్వరా..? అంటూ ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. అలాగే, పోలింగ్ రోజు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నారంటూ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రాంచందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, డాక్టర్ మెతుకు ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను జూబ్లీహిల్స్‌లో లేనని, అయినా తనపై కేసు నమోదు చేశారని ఆనంద్ ఆరోపించారు.

ఓటేసిన ప్రముఖులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటగిరి ఆల్ఫాన్సా స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. కృష్ణదేవరాయనగర్ పోలింగ్ కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీ శాలివాహనగ ర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఓటు వేశారు. షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దర్శకుడు రాజమౌళి, మధురానగర్‌లోని శ్రీనిధి విశ్వభారతి స్కూల్ పోలింగ్ కేంద్రంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శ్రీనగర్‌కాలనీ మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు గోపీచంద్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, యూసు్‌ఫగూడ ప్రభుత్వ పాఠశాలలో నటుడు తనికె ళ్ల భరణి ఓటు వేశారు. మధురానగర్‌లో ఐఏఎస్ బెన్హర్ దత్, ఐపీఎస్ స్వాతి లక్రా, సినీ దర్శకుడు రేలంగి నర్సింహారావు, వెంగళ్‌రావు నగర్‌లో సినీ రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటుకు సిత్రాలెన్నో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ‘ఓటు’ సిత్రాలెన్నో చూపింది. ఇంట్లో గొడవల నుంచి అంత కష్టపడి ఓటెందుకు వెయ్యాలనే దాకా ఎన్నో ఘటనలకు వేదికైంది. ఎన్నికల సరళి, ఓటరు నాడిని పరిశీలించేందుకు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి బృందం చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
భార్యాభర్తల మధ్య ఓటు చిచ్చు..
బోరబండలో ఒక ఓటరును పలకరించగా.. ‘‘నేను అధికార పార్టీకి ఓటేశా. నా భార్యను కూడా అదే పార్టీకి వేయాలని అడిగా. ఆమె తాను ప్రతిపక్ష పార్టీకే ఓటు వేస్తానని పట్టుబట్టింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. ఆమె ఓటెయ్యకుండానే, పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది’’ అని వాపోయారు.


రెండు పార్టీల దగ్గర డబ్బు తీసుకుని మూడో పార్టీకి ఓటేశా..
తనకు ఒక పార్టీ రూ.2,500, మరొక పార్టీ వాళ్లు రూ.1,000 ఇచ్చారని.. తాను ఆ రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని, మూడో పార్టీకి ఓటేశానని ఒక యువ ఓటరు చెప్పారు. ఓటు కొనేందుకు డబ్బులు ఖర్చు చేసిన నేత తర్వాత అంతకు రెండింతలు సంపాదించాలనే ఉద్దేశంతో అవినీతికి పాల్పడతారని, అందుకే ఇలా చేశానని పేర్కొన్నారు.
మాకు డబ్బులివ్వలే.. ఓటేయలే..
‘‘మా చుట్టుపక్కల వారందరికీ అన్ని పార్టీల వాళ్లు డబ్బులు పంచారు. మాకు ఇవ్వలేదు. రెక్కాడితే గానీ.. డొక్కాడని బతుకులు మావి. అందుకే మా కుటుంబంలోని వాళ్లంతా ఓటు కోసం లైన్లలో నిలబడకుండా పనికి వెళ్లారు’’ అని పెద్ద వయసున్న ఒక ఓటరు పేర్కొన్నారు.
చీర ఇవ్వలేదని వేరే పార్టీకి..
ఒక మహిళా ఓటరు స్పందిస్తూ.. ‘‘నాకు 2 పార్టీల వాళ్లు డబ్బులిచ్చారు. కానీ ఒక పార్టీ వాళ్లు మా పొరుగింటి వారికి చీర కూడా ఇచ్చారు. నాకు ఇవ్వలేదు. దాంతో రెండో పార్టీకి ఓటు వేశా..’’ అని పేర్కొన్నారు.
