Share News

JNTU: జేఎన్‌టీయూలో విద్యార్థుల ఘర్షణ

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:57 AM

ఆవిష్కరణలకు నిలయంగా ఉండాల్సిన జేఎన్‌టీయూ ఘర్షణలకు నెలవుగా మారింది. సాంకేతికత పరిఢవిల్లాల్సిన యూనివర్సిటీలో మద్యం ఏరులై పారుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో విద్యార్థుల ఘర్షణ

  • మద్యం తాగి వెళ్లిన డిటెయిన్డ్‌ విద్యార్థులు

  • గౌతమి, కిన్నెర హాస్టళ్ల వారిపై రాళ్ల దాడి

  • పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆవిష్కరణలకు నిలయంగా ఉండాల్సిన జేఎన్‌టీయూ ఘర్షణలకు నెలవుగా మారింది. సాంకేతికత పరిఢవిల్లాల్సిన యూనివర్సిటీలో మద్యం ఏరులై పారుతోంది. తాజాగా, యూనివర్సిటీలో డిటెయిన్‌ అయిన విద్యార్థులు కొందరు.. మద్యం సేవించిన మరికొందరు విద్యార్థులను వెంటబెట్టుకొని జేఎన్‌టీయూలోకి చొరబడ్డారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, వారి నుంచి తప్పించుకుని గౌతమి, కిన్నెర హాస్టళ్ల వైపు వెళ్లారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను బూతులు తిడుతూ, అడ్డొచ్చిన వారిపై రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగారు. దీంతో హాస్టల్‌ విద్యార్థులు పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు వచ్చి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షలు చేయగా బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌(బీఏసీ) 150కి పైగా నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ శుక్రవారం బాధిత విద్యార్థులుఆందోళనకు దిగారు. డిటైన్డ్‌ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


పర్యవేక్షించాల్సిన పాలకులు ఎక్కడ..?

యూనివర్సిటీలో ఉండి విద్యార్థుల ఆలనా పాలన చూడాల్సిన అధికారులు, ఆచార్యులు సాయంత్రానికి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వైస్‌చాన్స్‌లర్‌, రెక్టార్‌, రిజిస్ట్రార్‌ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారు క్యాంప్‌సలో నివసించేందుకు భవనాలున్నాయి. వారు తప్పనిసరిగా ఆయా భవనాల్లో ఉండాల్సి ఉన్నా, ఐదారేళ్లుగా వాటిని పాడుబెట్టారు. అలాగే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆచార్యులకు క్వార్టర్స్‌ ఉన్నా.. వారెవరూ అందులో ఉండటం లేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు, సమస్యలను పట్టించుకునే వారెవరూ అందుబాటులో లేకుండాపోయారు. ఈ విషయమై కొత్త వీసీ దృష్టి సారించాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Updated Date - Mar 08 , 2025 | 04:57 AM