Share News

JaggaReddy Bonalu Festival: గంజాయి తాగితే నరాలు పనిచేయవు.. దూరంగా ఉండండి

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:50 AM

నిత్యం పొలిటికల్‌ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.

JaggaReddy Bonalu Festival: గంజాయి తాగితే నరాలు పనిచేయవు.. దూరంగా ఉండండి

  • సంగారెడ్డి బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హితబోధ

  • చెడు అలవాట్లతో తల్లిదండ్రులను బాధపెట్టొద్దు

  • గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు

  • పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, జూలై 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిత్యం పొలిటికల్‌ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.


తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:50 AM