Sridhar Babu: రండి.. తెలంగాణలో ఆవిష్కరించండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:56 AM
తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ చాంబర్స్ ఆఫ్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో ఐఐటీఈఎక్స్ 2025 ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'మేకిన్ ఇండియా’ కాదు.. ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ .. ఇదే మా నినాదం.. ప్రణాళికాబద్ధంగా అడుగులు
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రంగా జోన్లు
జాతీయ సగటుకు 6 రెట్లు రాష్ట్ర సీఎంజీఆర్
పరిశ్రమలు పోతున్నాయని కొందరు విషప్రచారం చేస్తున్నారు
3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
ఐఐటీఈఎక్స్ ముగింపు వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ‘మేకిన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) కాదు.. ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ (తెలంగాణలో ఆవిష్కరించండి) అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను ‘ఇన్నోవేషన్ హబ్’గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ చాంబర్స్ ఆఫ్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో (ఐఐటీఈఎక్స్)- 2025’ ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కంపౌండ్ మంత్లీ గ్రోత్ రేటు(సీఎంజీఆర్) 2.9 శాతంగా ఉండగా, జాతీయ సగటు 0.52 శాతం మాత్రమేనన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఆరు రెట్లు అధికంగా నమోదైందన్నారు. 2024-25లో రాష్ట్ర పారిశామ్రిక ఉత్పత్తులు, సేవల విలువ (జీఎ్‌సవీఏ) రూ.2.77 లక్షల కోట్లకు చేరిందని, ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పేరోల్ ఎన్‌రోల్‌మెంట్స్‌లో 13.9 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరూ విషప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ‘ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం.
ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 150 కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. 51 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయ’ని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్థి చేస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్ లోపల టెక్నాలజీ, సర్వీసెస్ జోన్, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య తయారీ జోన్, ఆర్‌ఆర్‌ఆర్ బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. తాము అయిదేళ్ల కోసం ప్రణాళికలు రూపొందించడం లేదని. రాబోయే తరాల కోసం ఆలోచిస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. గత 18 నెలల్లో కొత్తగా 15 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎంఎ్‌సఎంఈ పార్కులను అభివృద్థి చేస్తున్నామని, వాటిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు మంత్రి పురస్కారాలు అందించారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్. రవికుమార్, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్ 2025 కన్వీనర్ విమలేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.