Share News

Hyderabad: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:33 AM

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ఇల్లంతా వెతికి అరగంట తర్వాత వెళ్లిపోయాడు.

Hyderabad: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు

  • అరగంట పాటు ఇల్లంతా వెతికి వెనక్కి

  • మా ఇంటి వద్ద గట్టి భద్రత కల్పించాలి

  • ఘటనపై అనుమానాలున్నాయ్‌: అరుణ

బంజారాహిల్స్‌/మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ఇల్లంతా వెతికి అరగంట తర్వాత వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 56లో నివసించే డీకే అరుణ ఈ నెల 15న మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఇంట్లో ఆమె కుమార్తె, మనవరాలు, పని వాళ్లు ఉన్నారు. 16న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి, వంట గది పక్కనే ఉన్న కిటికీ తొలగించి, ఇంట్లోకి వెళ్లాడు. హాల్‌లో తిరిగాడు. బెడ్‌రూంలో ఏదో వెతికాడు. అక్కడ ఉన్న సామాన్లను చిందరవందర చేశాడు. అరగంట తర్వాత వచ్చిన దారిన వెళ్లిపోయాడు. కాగా, ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాల వైరును ఆగంతకుడు కోసేశాడు. దీంతో ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, తన నివాసంలోకి ఆగంతకుడు చొరబడటం ఆందోళన కలిగిస్తోందని డీకే అరుణ అన్నారు.


ఇళ్లంతా తిరిగి ఒక్క వస్తువును కూడా దొంగిలించలేదంటే.. ఎవరైనా తనకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారేమో..? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మహబూబ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం అరుణ మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా తాను మహబూబ్‌నగర్‌లో ఉన్నానని తెలిపారు. తన ఇంటి వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తన భర్తకు గన్‌మెన్లను ఇవ్వాలని కొద్దిరోజుల క్రితమే లేఖ రాశానని తెలిపారు. కాగా, ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అరుణకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని కోరారు. అంతకు ముందు సంజయ్‌.. డీకే అరుణకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

Updated Date - Mar 17 , 2025 | 04:33 AM